sanjay bhandari
-
డిఫెన్స్ డీలర్‌పై సీబీఐ కేసు నమోదు
న్యూఢిల్లీ : డిఫెన్స్ డీలర్ సంజయ్ బండారిపై కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. 2009లో స్విస్ సంస్థ 'పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ 75 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల సేకరణ విషయంలో ముడుపులు తీసుకొని.. అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుమారు రూ.339 కోట్ల మేర లంచాలు తీసుకున్నాడన్న ఆరోపణలపై బండారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. శుక్రవారం ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన సోదాల్లో ఆయన ఇంట్లో లభ్యమైన విలువైన ఆస్తులన్ని ముడుపుల రూపంలో వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్‌లో ఉన్న సంజయ్ బండారికి చెందిన ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇక రాబర్ట్ వ్యాపారవేత్త, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంజయ్ బినామీ అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. లండన్‌లో ఉన్న వాద్రా ఇంటికి బండారి బినామిగా ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా సంజయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు. సంజయ్‌తో పాటు కొంతమంది వైమానిక దళ, రక్షణ అధికారులకు కూడా ఈ ముడుపులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించి ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణనిస్తారు. స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్‌టీపీ - 32 విమానాల్లో తరచుగా వైఫల్యాలు తలెత్తడంతో పిలాటస్ పీసీ- 7 ఎంకే - II ను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా యూపీఏ-2 నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2012లో 75 శిక్షణ విమానాల కోసం రూ. 2,896 కోట్లతో పిలాటస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. -
రాబర్ట్ వాద్రాకు మరో గట్టి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నగదు అక్రమ చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు గట్టి షాక్ తగిలింది. రాబర్ట్ వాద్రా బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి సంస్థ ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఈ గ్రూపు సంస్థలు, ఇతర విభాగాలతో అన్ని వ్యాపార లావాదేవీలను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో (ఫిబ్రవరి 2018)మొట్టమొదటిసారిగా ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్‌తో వ్యాపారాన్ని ఆరునెలలపాటు నిషేధించింది. తాజాగా తదుపరి ఆదేశాల వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించడం గమనార్హం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక ఒప్పందాలతో (2005లో రక్షణ ఒప్పందం, 2009లో పెట్రోలియం,తదితర) భండారీకి సంబంధం ఉన్నాయని ఆరోపణలు. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ 'పిలాటస్'తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2016 లో ఐటీ దాడుల నేపథ్యంలో డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారి లండన్ పారిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ రాబర్ట్ వాద్రా కస్టోడియల్ రిమాండ్‌ను కోరుతోంది. పెట్రో, రక్షణ వ్యవహారాల్లో భండారి లంచాలు తీసుకున్నారని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. అలాగే లండన్ నుంచి భండారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
రాబర్ట్ వాద్రా స్కామ్ ఏమిటీ ?
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బుధ, గురు వారాలతోపాటు శనివారం నాడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఇంతకు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటీ? ఆ ఆరోపణలు ఎలాంటివి, ఇప్పుడు వచ్చాయి ? వాటికి సంబంధించి ఈడీ అధికారుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? ఆయనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ని విచారించేందుకు ఎందుకు ఇంతకాలం పట్టింది ? ఆయనపై ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఉన్నా ఆయన్ని ఇప్పుడే ఎందుకు విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో ఓ రక్షణ ఒప్పందం, 2009లో ఓ పెట్రోలియం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ ఒప్పందం ద్వారా లబ్ది పొందిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి 2009లో లండన్‌లోని 12 బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో ఓ భవనాన్ని తన కంపెనీ ‘వోర్టెక్స్’ ద్వారా 19 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దాన్ని ఆ మరసటి సంవత్సరమే దుబాయ్ వ్యాపారి సీసీ థంపీకి విక్రయించారు. ఆ భవనం పునరుద్ధరణకు సీసీ థంపీ 65 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఆ భవనాన్ని బ్రిటన్‌లో సంజయ్ భండారీకి సంబంధం ఉన్న ఓ సింటాక్ కంపెనీకి కొన్న రేటుకే అంటే 19 లక్షల పౌండ్లకే విక్రయించారు. అంటే భండారీ కొనుగోలు చేసిన భవనం తిరిగి భండారీ చేతికే వచ్చిందన్న మాట. భండారి, సీసీ థంపీ, వాద్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నది ఈడీ అధికారుల వాదన. ఒప్పందాల్లో లబ్ది పొందినందుకుగాను భండారీ ఆ భవనాన్ని రాబర్ట్ వాద్రా కోసం ముడుపుల కింద కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మరి ఈ ఆరోపణకు రుజువు ఏమిటీ? 2016లో ఢిల్లీలోని సంజయ్ భండారీ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు ఓ కంప్యూటర్లో భండారి బంధువుకు, వాద్రా కార్యదర్శికి మధ్య నడిచిన ఈమెయిళ్లు దొరికాయి. లండన్‌లో ఉంటున్న భండారీ మేనల్లుడు సుమిత్ ఛద్దా, లండన్ 12 బ్య్రాన్‌స్టన్ స్కేర్ భవనం పునరుద్ధరణ బిల్లుల చెల్లింపుల గురించి వాద్రా కార్యదర్శికి ఆ మెయిల్స్ పంపించారు. అందులో ఓ మెయిల్‌కు వాద్రా స్వయంగా స్పందిస్తూ ‘రేపు ఉదయం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కార్యదర్శి మనోజ్ పరిష్కరిస్తారు’ అని చెప్పారు. భవనం పునరుద్ధర ణకు అయిన 65 వేల పౌండ్లను వాద్రా చెల్లించారనే, అందుకనే భండారి వద్ద కొన్న రేటుకు సీసీ థంపీ తిరిగి విక్రయించారని, తన ఆస్తి కావడం వల్ల వాద్రా పునరుద్ధరణ ఛార్జీలు చెల్లించారన్నది ఈడీ అధికారుల అనుమానం. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ ‘పిలాటస్’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. లండన్‌లోని ఆస్తులు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ భండారి, తన ఇంటిపై 2016లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో నేపాల్ మీదుగా లండన్ పారిపోయారు. దాంతో లండన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. వాద్రా కార్యదర్శి, భండారి బంధువు మధ్య కొనసాగిన ఈ మెయిళ్లు మినహా మరో సాక్ష్యాన్ని ఈడీ అధికారులు సాధించలేకపోయారు. లండన్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్న రాబర్ట్ వాద్రాను విచారిస్తున్న అధికారులు, భండారీతో ఆయనకున్న సంబంధాల గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారని తెల్సిందే. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే ఆమె భర్త వాద్రాను విచారించడానికి కారణం ఆమె నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి లేదా ఆమె పరువు తీయడానికి ప్రయత్నం కావచ్చు. రఫేల్ యుద్ధ విమానాల డీల్‌లో నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా విమర్శిస్తున్న రాహుల్ గాంధీ నోటికి తాళం వేసే ప్రయత్నమూ కావచ్చు. ఏదీ ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే అసలు విషయం. -
భండారీపై నల్లధన నిరోధక కేసు నమోదు
న్యూఢిల్లీ: ఆయుధాల సరఫరాదారు సంజయ్ భండారీపై నల్లధన నిరోధక చట్టం కింద ఆదాయపు పన్ను శాఖ తొలి కేసు నమోదు చేసింది. అలాగే భారత్‌తో పాటు విదేశాల్లో ఉన్న అతని ఆస్తుల్ని అటాచ్ చేసే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆదాయపు పన్ను చట్టాల కింద కూడా భండారీపై విచారణ చేస్తున్నామని ఐటీ అధికారులు వెల్లడించారు. భండారీ, అతని సహచరులకు సంబంధించి అరడజను విదేశీ ఆస్తుల్ని గుర్తించామని, స్వదేశంలోని ఆస్తులపై కూడా విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే 120 శాతం పన్ను, జరిమానాతో పాటు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. గతేడాది ఏప్రిల్‌లో ఢిల్లీలోని భండారీ కార్యాలయాలపై దాడుల సందర్భంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. -
ఓఎస్డీ అప్పారావును కొనసాగిస్తా: అశోక్ గజపతి
తన ఓఎస్డీ అప్పారావు ఫోన్ కాల్స్‌ను తనిఖీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను కోరినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చెప్పారు. అన్యాయంగా ఆయనను ఉరేయమని మాత్రం చెప్పబోనని, ఆయన మీద తనకు నమ్మకం ఉన్నంత వరకు ఓఎస్డీగా కొనసాగిస్తానని తెలిపారు. తాను సంజయ్ భండారీని కలిశానని ఆయన అంగీకరించారు. ఎయిర్‌షోలో స్టాల్ ప్రారంభానికి తనను పిలిస్తే వెళ్లానని, అక్కడే ఆయనను కలిశానని అన్నారు. అప్పారావుపై అవినీతి ఆరోపణలు ఏంటో తనకు తెలియదని, తాను కూడా పత్రికలలోనే చూశానని అన్నారు. వాద్రా లండన్‌లో ఇల్లు కొనుక్కున్నారని కూడా ఆరోపణలు వచ్చాయని తెలిపారు. అప్పారావును తాను రక్షించడం లేదని తెలిపారు. ఆయన మీద వచ్చినవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, వాటి మీద విచారణ జరిగితే తప్ప నిజానిజాలు ఏంటో తెలియవని అన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి గానీ మరెక్కడి నుంచి గానీ తనను ఎవరూ అడగరని కేంద్ర మంత్రి తెలిపారు. ఆరోపణల నేపథ్యంలో మీడియా ప్రతినిధులను అశోక్ గజపతిరాజు తన కార్యాలయానికి పిలిచి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. అయితే ఓఎస్డీ అప్పారావు మాత్రం మీడియాకు ముఖం చాటేశారు. ఫోన్ కాల్స్‌కు కూడా ఆయన స్పందించడం లేదు.