న్యూఢిల్లీ : డిఫెన్స్ డీలర్ సంజయ్ బండారిపై కేంద్రం దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. 2009లో స్విస్ సంస్థ 'పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్ లిమిటెడ్ 75 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల సేకరణ విషయంలో ముడుపులు తీసుకొని.. అవకతవకలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. సుమారు రూ.339 కోట్ల మేర లంచాలు తీసుకున్నాడన్న ఆరోపణలపై బండారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. శుక్రవారం ఢిల్లీలో సీబీఐ నిర్వహించిన సోదాల్లో ఆయన ఇంట్లో లభ్యమైన విలువైన ఆస్తులన్ని ముడుపుల రూపంలో వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో దక్షిణ ఢిల్లీలోని పంచశీల పార్క్‌లో ఉన్న సంజయ్ బండారికి చెందిన ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇక రాబర్ట్ వ్యాపారవేత్త, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు సంజయ్ బినామీ అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం విదితమే. లండన్‌లో ఉన్న వాద్రా ఇంటికి బండారి బినామిగా ఉన్నట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలో తాజాగా సంజయ్ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు. సంజయ్‌తో పాటు కొంతమంది వైమానిక దళ, రక్షణ అధికారులకు కూడా ఈ ముడుపులతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా పిలాటస్' ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించి ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణనిస్తారు. స్వదేశి పరిజ్ఞానంతో తయారు చేసిన హెచ్‌టీపీ - 32 విమానాల్లో తరచుగా వైఫల్యాలు తలెత్తడంతో పిలాటస్ పీసీ- 7 ఎంకే - II ను భారత్ కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా యూపీఏ-2 నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2012లో 75 శిక్షణ విమానాల కోసం రూ. 2,896 కోట్లతో పిలాటస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment