Manoj Arora
-
న్యాయమే గెలిచింది - రాబర్ట్ వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మనీ ల్యాండరింగ్ కేసులో ఊరట లభించింది. మధ్యతర బయిల్పై ఉన్న రాబర్ట్ వాద్రాతోపాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరాకు మరోసారి ఊరటనిస్తూ ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది స్పెషల్ సీబీఐ కోర్టు. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ సోమవారం ఈ ఆదేశాలిచ్చారు. అయితే దేశం విడిచి వెళ్లరాదంటూ షరతులు విధించారు. దర్యాప్తునకు పిలిచినపుడు విచారణ అధికారులతో సహకరించాలని, సాక్ష్యాలను నాశనం చేయవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించ వద్దని నిందితులిద్దరినీ న్యాయమూర్తి కోరారు. షరతులతో కూడిన ఈ బెయిల్ కోసం ఇద్దరూ చెరి రూ. 5లక్షల పర్సనల్ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ముందస్తు అనుమతి లేకుండా వాద్రా, అరోరా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ విజయం సాధించిందని వాద్రా న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వ్యాఖ్యానించారు. నిజం నిగ్గు తేలిందనీ, న్యాయమే గెలిచిందని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న అచంచల విశ్వాసం విజయం సాధించిందనీ, ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన హితులు, సన్నిహితులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సవాల్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. -
వాద్రా మధ్యంతర బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మార్చి 2 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు సహకరించాలని వాద్రాకు సూ చించింది. తదుపరి వాదనలు వినేంత వరకు వాద్రా ను అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మరో నిందితుడు, వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాను కూడా మార్చి 2 వరకు అరెస్టు చేయకూడదని ఈడీని ఆదేశించింది. మనీల్యాండరింగ్ కేసులో వాద్రా విచారణకు సహకరించడం లేదని.. అతడిని మరింత ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు నివేదించింది. విచారణకు సంబంధించిన విషయాలను వాద్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారంది. అతడికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ వాదనలను వాద్రా తరఫు న్యాయవాది ఖండించారు. ఈడీ ఆదేశించిన ప్రతిసారీ వాద్రా విచారణకు హాజర య్యారని, తదుపరి విచారణకు కూడా హాజరయ్యేందుకు సిద్ధం గా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వాద్రా మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ఈడీ విచారణ తీరుపై రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. విచారణకు సహకరిస్తున్నా అధికారులు తనను వేధిస్తున్నారన్నారు. రూ. 4.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ వేదికగా ఈడీపై విమర్శల వర్షం కురిపించారు. ఈడీ ఆదేశించిన నాటి నుంచి తాను విచారణకు సహకరిస్తున్నానని, ఏమీ దాయ డం లేదని స్పష్టం చేశారు. 6 రోజుల నుంచి రోజూ 8 నుంచి 12 గంటల పాటు తనను విచారిస్తున్నారని తెలిపారు. లంచ్‌కు మాత్రమే 40 నిమిషాల విరా మం ఇచ్చేవారని చెప్పారు. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో కూడా తన వెంట అధికారులను పంపే వారని ఆరోపించారు. -
రాబర్ట్ వాద్రా బినామీ బాగోతం బట్టబయలు!
ఆయుధాల డీలర్ బినామీగా లండన్‌లో ఇల్లు కొనుగోలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఓ ఆయుధాల డీలర్‌తో సంబంధాలు ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెల్లడైంది. సదరు డీలర్‌ను బినామీగా పెట్టుకొని లండన్‌లో ఆయన పెద్ద భవనాన్ని (మాన్షన్) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఫైల్‌ను ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమీక్షిస్తోంది. గత నెలలో ఆయుధాల డీలర్ సంజయ్ భండారికి చెందిన 17 నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్ మెంట్ సంస్థలు దాడులు నిర్వహించాయి. సంజయ్‌కి, వాద్రాకు ఉన్న సంబంధాలపై ఈ దాడుల్లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. వాద్రా, అతని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మనోజ్ అరోరా.. భండారికి పంపిన ఈమెయిల్స్, విచారణలో భండారి తెలిపిన వివరాలు దర్యాప్తు నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. లండన్ బ్రియాన్స్టన్లోని ఎల్లెర్టన్ హౌస్ రూ. 19 కోట్లకు కొనుగోలు చేయగా.. దాని చెల్లింపులు, అదనపు హంగులు చేకూర్చే విషయమై ఈ ఈమెయిల్స్‌లో వాద్రా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, వాద్రా లాయర్లు మాత్రం ఈ అంశాలను తిరస్కరిస్తున్నారు.