మృగాడి వికృత చేష్ట.. వినుప్రియ విషాదాంతం!
- ఫేస్‌బుక్‌లో వినుప్రియ ఫొటోమార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన యువకుడు
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఖాకీలు, సైబర్ క్రైమ్
- నగుబాటు భరించలేక తనువు చాలించిన యువతి
- ప్రేమికుడి అరెస్ట్.. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమ మాటున మృగాడి వికృత చేష్ట.. ఖాకీల అలవిమాలిన నిర్లక్ష్యం.. వెరసి యువతి ప్రాణాలు తీశాయి. ఫొటోమార్ఫింగ్‌పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో భరించలేని అవమాన భారంతో బాధితురాలు ఉరి వేసుకొని తనువు చాలించింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) బీఎస్సీ పాసై ఓ పాఠశాలలో టీచర్‌గా చేరింది. హాయిగా సాగుతున్న ఆమె జీవితంలో మార్ఫింగ్ చేసిన అశ్లీల ఫొటోలు ఈనెల 17న ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఇది చూసి అవమానభారంతో కుంగిపోయిన వినుప్రియ తల్లిదండ్రులకు చెప్పుకొని బోరున విలపించింది.
తండ్రి అన్నాదురై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఐడీని బ్లాక్ చేసే సర్వర్ విదేశాల్లో ఉంటుందని, ఇందుకు 20 రోజులు పడుతుందని అక్కడ తాపీగా సమాధానం ఇచ్చారు. అన్నాదురై అక్కడి నుంచి సైబర్‌క్రైం పోలీసుల వద్దకు వెళ్లి వేడుకున్నాడు. అక్కడ ఒక సెల్‌ఫోన్ కొనివ్వమని హెడ్ కానిస్టేబుల్ సురేశ్ బేరమాడాడు. అన్నాదురై వెంటనే సెల్‌ఫోన్ కొనిచ్చాడు. అయినా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం సురేశ్ చేయలేదు. ఈ క్రమంలో 26న మరోసారి వినుప్రియ అశ్లీల ఫొటో ఫేస్‌బుక్‌లో కనిపించింది. హతాశులైన తల్లిదండ్రులు మళ్లీ పోలీసుల వద్దకు పరుగులు తీశారు. తనకు, తనవారికి జరిగిన అవమానాన్ని భరించలే కపోయిన వినుప్రియ ఈనెల 26న సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్‌బుక్ ఐడీని బ్లాక్ చేయడానికి 20 రోజుల సమయం పడుతుందని నిర్లక్ష్యం వహించిన పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే బ్లాక్ చేశారు. మూడో రోజునే నిందితుడి అరెస్ట్ జరిగిపోయింది. ఫిర్యాదు అందగానే పోలీసులు చర్య తీసుకుని ఉంటే మరోసారి అశ్లీల ఫొటోలు ప్రచారమయ్యేవి కావని, వినుప్రియ నిండు ప్రాణాలు పోయేవి కావని సర్వత్రా చర్చ జరుగుతోంది.
ప్రేమించలేదని..
ప్రేమ పేరుతో ఉన్మాదిగా మారిన సురేశ్ అనే యువకుడే వినుప్రియ ప్రాణాలను బలిగొన్నట్లు తెలుస్తోంది. సేలం జిల్లా కల్‌పారాపట్టికి చెందినసురేశ్.. వినుప్రియ వెంట పడేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ వినుప్రియ తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఆమె పరువు తీయాలని నిర్ణయించుకున్నాడు. వినుప్రియ ఫొటోను సంపాదించి మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టినట్లు బుధవారం అరెస్టయిన సురేశ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. సెల్‌ఫోన్ లంచంగా తీసుకున్న హెడ్ కానిస్టేబుల్ సురేశ్‌ను సస్పెండ్ చేశారు. వినుప్రియ ఫొటోలను మార్ఫింగ్ చేసిన నిందితుడిపై పోలీసులు కేసు పెట్టారు.