వినుప్రియ ఆత్మహత్య కేసులో ...
టీనగర్: వినుప్రియ ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సేలం సమీపానగల ఇలంపిళ్లై ప్రాంతానికి చెందిన చేనేత కార్మికుడు అన్నాదురై కుమార్తె వినుప్రియ (20) ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌లో అసభ్య చిత్రాన్ని విడుదల చేసిన నిందితులను అరెస్టు చేసేంతవరకు తమ కుమార్తె మృతదేహాన్ని తీసుకెళ్లమని తెలుపుతూ వినుప్రియ తల్లిదండ్రులు ఆందోళనలో పాల్గొన్నారు.
దీనిపై జిల్లా ఎస్‌పీ అమిత్‌కుమార్ సింగ్ సమాధాన చర్చలు జరపడంతో వినుప్రియ మృతదేహాన్ని వారు తీసుకువెళ్లారు. ఇలావుండగా ఈ కేసు గురించి మకుడంచావడి పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇందులో ఇలంపిళ్లై సమీపానగల కల్‌పారపట్టి ప్రాంతానికి చెందిన పి. సురేష్ (21) అనే చేనేత కార్మికుని పోలీసులు అరెస్టు చేశారు.
నష్ట పరిహారం చెల్లించాలి: ఐద్వా
ఆత్మహత్య చేసుకున్న వినుప్రియ కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలంటూ అనైత్తిండియా జననాయగ మాదర్ సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ కేసులో వినుప్రియ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సేలం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఆందోళన జరిపారు.
ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కార్యదర్శి తంగవేలు, ఐద్వా జిల్లా కార్యదర్శి కె. రాజాత్తి, ఇందియ జననాయగ వాలిబర్ సంఘం జిల్లా కార్యదర్శి ఎన్ ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దీనిగురించి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ ఈ కేసును సత్వరమే ముగించాలని కోరారు. వినుప్రియ మరణానికి పోలీసులు నైతిక బాధ్యత వ హించాలని, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన నష్ట పరిహారం అందచేయాలని డిమాండ్ చేశారు.