స్టేషన్లో ఆగలేదని.. ఎక్స్ ప్రెస్ రైల్లోంచి దూకేశాడు!
తాను దిగాల్సిన స్టేషన్లో ఆగకపోవడంతో ఎక్స్ ప్రెస్ రైళ్లోంచి దూకేసిన యువకుడు చనిపోయాడు. ఈ ఘటన పుదుచ్చేరిలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వినోద్(20) అనే విద్యార్థి కోంబాక్కం నుంచి సమీపంలోని గ్రామానికి వెళ్లాలనుకున్నాడు. మంగళూరు-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కాడు. అతడు దిగాల్సిన స్టేషన్ విల్లనూర్ కాగా, ఆ స్టేషన్లో రైలు ఆగదట. అయితే, తాను దిగాల్సిన స్టేషన్ వచ్చింది. రైలు ఆగుతుందని చూశాడు.
కానీ రైలు ఆగకుండా వెళ్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక వినోద్ కంగారులో రైల్లోంచి ప్లాట్ ఫాం పైకి దూకేశాడు. దురదృష్టవశాత్తూ ఆ యువకుడు రైలు చక్రాల కింద పడి నలిగిపోయాడు. దీంతో కొన్ని సెకన్లలో సంఘటన స్థలంలోనే యువకుడు మృతిచెందాడు. వినోద్ శరీరం నుజ్జునుజ్జు అయిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.