న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఏజెన్సీల అధీనంలోని ఆధార్ నమోదు కేంద్రాలను జూలై చివరికల్లా ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలకు తరలించాలని అన్ని రాష్ట్రాలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) ఆదేశించింది.
ఈ విషయమై యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే మీడియాతో మాట్లాడుతూ ‘ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా 25,000 కేంద్రాలు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వస్తాయి. దీంతో ప్రైవేటు సంస్థలు ఆధార్ నమోదు కోసం వసూలు చేస్తున్న అధిక ఫీజులకు అడ్డుకట్ట వేయవచ్చ’ని అన్నారు. ఆధార్ కేంద్రాలను కలెక్టరేట్లు, జిల్లా పరిషత్, తాలూకా, మున్సిపల్ కార్యాలయాలు, బ్యాంకుల ప్రాంగణాలకు తరలించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసినట్లు పాండే తెలిపారు.