'కలిసి పనిచేద్దామని అసభ్యంగా తాకాడు'
చండీగఢ్: మరో ఆప్ నేత చిక్కుల్లో పడ్డాడు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేత తనను వేధించాడని పాకిస్థాన్ సంతతికి చెందిన ఓ కెనడా మహిళ ఆరోపించింది. ఓ పని పేరిట తన వద్దకు వచ్చిన సమయంలో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, అసభ్యంగా తాకాడని చెప్పింది. తాను చివరికి ఎలాంటి హానీ జరగకుండా తప్పించుకొని బయటపడ్డాక కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించాడని, ఆ తర్వాత జరిగిన విషయం ఎవరికీ చెప్పవద్దని, మరోసారి కలిసి పనిచేద్దామని పలుమార్లు బ్రతిమాలినట్లు ఆరోపిచింది. పంజాబ్లోని దేవ్ మన్ అనే ఆప్ కు చెందిన వ్యక్తి అక్కడ ఎస్సీ, ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు.
ఆయనను 2017 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలోకి దించుతున్నట్లు ఆప్ ప్రకటించింది. ఈ లోగానే ఆయనపై వేధింపుల ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై దేవ్ ను ప్రశ్నించగా ఇదంతా శిరోమణి అకాలీదల్ వాళ్లు చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించగానే జీర్ణించుకోలేని ఆ పార్టీ తనపై మరో ఇద్దరు భారత సంతతికి చెందిన కెనడీయన్ మహిళలతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను ఎస్సీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడిగా ఉన్నానని, ఇప్పుడు వారంతా తనవైపు తిరగడంతో తన విజయం ఖాయం అని భయపడి ఇలా లేనిపోని నిందలు వేస్తున్నారని చెప్పారు. తాను 2000 నుంచి కెనడా వెళుతున్నానని, 2006లో వర్క్ పర్మిట్ కూడా తీసుకున్నట్లు చెప్పారు. భవిష్యత్ లో కూడా తనపై ఇలాంటి ఆరోపణలు వస్తాయని అయినా తనకు ఏం కాదని ధీమా వ్యక్తం చేశారు.