న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా రక్కసి నుంచి కాపాడుకునేందుకు సాయం చేసే ఆరోగ్య సేతు యాప్ మరో ఘనత సాధించింది. ఏప్రిల్‌లో 80 మిలియన్లుగా ఉన్న డౌన్‌లోడ్ల సంఖ్య జూలై నాటికి 127.6 మిలియన్లకు చేరుకుంది. దీంతో ఇది ప్రపంచంలోనే అధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న కోవిడ్ ట్రాకింగ్ యాప్‌గా నిలిచింది. ఆరోగ్య సేతు.. కరోనా తాజా సమాచారంతోపాటు, వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలను అందిస్తూ, చుట్టుపక్కల కరోనా రోగులుంటే అలర్ట్ చేస్తుంది. ఈ యాప్‌ని ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయగా కేవలం 13 రోజుల్లోనే 50 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఏప్రిల్ 28 నాటికి ఈ సంఖ్య 75 మిలియన్లు దాటింది. మే 6 వరకు ఈ సంఖ్య 90 మిలియన్లను అధిగమించింది. జూలైలో 127 మిలియన్ల మైలురాయిని దాటేసింది. (ప్రతి ఉద్యోగి చేతిలో ఆరోగ్యసేతు)
అయితే జనాభా పరంగా ఈ యాప్ వినియోగంలో భారత్ నాల్గవ స్థానంలో ఉందని అంతర్జాతీయంగా యాప్‌ల డౌన్‌లోడ్స్, వాటి ర్యాంకింగ్‌లను విశ్లేషించే సెన్సర్ టవర్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఆరోగ్య సేతును దేశ జనాభాలో 12.5 శాతం మంది మాత్రమే వినియోగిస్తుండటంతో భారత్ 4వ స్థానానికే పరిమితమైందని తెలిపింది. ఆస్ట్రేలియాలో కోవిడ్ భద్రత కోసం ప్రవేశపెట్టిన 'కోవిడ్ సేఫ్' యాప్‌ను అక్కడి 21 శాతం జనాభా డౌన్‌లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని పేర్కొంది. దీంతో కోవిడ్ ట్రాకింగ్ యాప్‌కు అత్యధిక ఆదరణ కలిగిన దేశంగా ఆస్ట్రేలియా ప్రథమ స్థానంలో ఉంది. కాగా భారత్‌లోని కొన్ని రాష్ట్రాలు ఆరోగ్య సేతు వంటి ఇతర యాప్‌లను వృద్ధి చేయడంతో అక్కడి జనాభా స్థానిక యాప్‌లను వినియోగిస్తోంది. ఇది ఆరోగ్య సేతు డౌన్‌లోడ్ల సంఖ్యను, వినియోగాన్ని ప్రభావితం చేస్తోంది. (సాహో.. ఆరోగ్య సేతు..!)
Comments
Please login to add a commentAdd a comment