లైంగికదాడి కేసులో ఎమ్మెల్యే అరెస్ట్
గౌహతి : లైంగిక దాడి కేసులో మేఘాలయ ఎమ్మెల్యే జూలియస్ డార్పాంగ్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 14ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇప‍్పటికే ఆ రాష్ట్ర హోంమంత్రి కుమారుడితో పాటు నలుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత ఏడాది తనను గెస్ట్హౌస్‌కు పిలిపించి దాడికి పాల్పడ్డారంటూ బాధిత బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఎమ‍్మెల్యేపై కేసు నమోదు కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే కోసం పోలీసులు లుక్ అవుట్ జారీ చేసి ఆయన నివాసంలో సోదాలు జరిపారు. ఈ రోజు తెల్లవారుజామున ఎమ్మెల్యేను గౌహతిలో అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆయనను షిల్లాంగ్‌లోని సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా జూలియస్ డార్పాంగ్ మౌహతి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయిన ఆయన రూలింగ్ పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు. లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టం కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.