ఎయిరిండియా విమానానికి తప్పిన ముప్పు
కొచ్చి: ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కోచి విమానాశ్రయంలో అబుదాబి-కోచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2.39 గంటలకు చేరుకున్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కొచ్చి విమానాశ్రాయానికి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ఎయిర్ పోర్టులోని టాక్సీవేనుంచి పార్కింగ్ వే వైపు దూసుకుపోయింది. దీంతో ముంగు బాగం బాగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(సీఐఏఎల్) అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ, అలాగే డిఐజిసి ఏవియేషన్ రెగ్యులేటర్ దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి అందుబాటులో లేరు.