కోతిపై యాసిడ్ దాడి..50వేల రివార్డు
ముంబై: రకరకాల కారణాలతో ప్రత్యర్థులపై యాసిడ్ దాడి చేయడం మనకు తెలిసిందే. కానీ నోరులేని జీవిపై యాసిడ్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. నాలుగురోజుల క్రితం ముంబై సమీపంలో యాసిడ్ గాయాలతో కనిపించిన ఓ కోతిని వన్యప్రాణ సంరక్షణ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రమైన గాయాలతో బాధపడుతూ ఆ కోతి మంగళవారం చనిపోయింది. దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారికి 50 వేల రూపాయల బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే.. తీవ్ర గాయాలతో ఓ కోతి హృదయక విదారక స్థితిలో థానేలోని అటవీ ప్రాంతంలో గత శుక్రవారం కనిపించింది. దీన్ని గమనించిన వైల్డ్ లైఫ్ సంక్షేమ సంఘం అటవీశాఖకు సమాచారం అందించడంతో ఆ వానరాన్ని ఆసుపత్రికి తరలించారు. కోతిపై గాయాలను పరిశీలించిన వైద్యులు ఇది యాసిడ్ దాడి అని తేల్చారు. యాసిడ్ వల్లే పొట్ట, కాళ్లు, ముఖ భాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయని గుర్తించారు. సుమారు నాలుగురోజులపాటు చికిత్స అందించినా వానరాన్ని కాపాడలేకనపోయారు. గాయాలకు ఇన్ఫెక్షన్ సోకి మరింత తీవ్రం కావడంతో మృతి చెందింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ద హ్యమన్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థ సభ్యులు దీనికి బాధ్యులైన వ్యక్తులను పట్టిచ్చిన వారికి భారీ బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.