శశికళ సమాధానం చెప్పాలి: స్టాలిన్
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న సంక్షోభంపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తనదైన శైలిలో స్పందించారు. బుధవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో సంక్షోభం కొత్తకాదు అన్నారు. ఆ వ్యవహారంలో మేం జోక్యం చేసుకోం అంటూనే.. పన్నీర్ సెల్వం ఆరోపణలకు శశికళ సమాధానం చెప్పాలని అన్నారు.
తమిళనాడులో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ విద్యాసాగర్ రావు చర్యలు తీసుకోవాలని స్టాలిన్ కోరారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే పాలనలో అంతా ఓ మిస్టరీగా మారిందని. ముఖ్యమంత్రే తనను బలవంతంగా దించేశారని చెబుతున్నారని.. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండా స్టాలిన్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారన్న వార్తలు వచ్చిన విషయం తెలసిందే.