కన్నీటి పర్యంతమవుతున్న ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కన్నీటి పర్యంతమయ్యారు. తన స్థానంలో ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (సీపీసీసీ) అధ్యక్ష పదవిని మోహన్ మార్కమ్ చేపడుతున్న సందర్భంగా ఆయన గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన బఘేల్ పార్టీని ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో ఆయన వారసుడిగా సీపీసీసీ పదవిలో మార్కమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఆయన పదవీ స్వీకార కార్యక్రమం శనివారం రాయ్‌పూర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన బఘేల్.. గత ఐదేళ్లుగా తనతో కలిసి పనిచేసిన పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన నాయకత్వంలో పార్టీకి సహకరించిన వారిని గుర్తుచేసుకున్నారు.
‘2013లో ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తరువాత రాహుల్ గాంధీ సీపీసీసీ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఘోరపరాజయం అనంతరం పార్టీ నాయకులు ప్రారంభించిన పోరాటం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలోకి వచ్చే వరకు కొనసాగింది' అని బఘేల్ పేర్కొన్నారు. సీపీసీపీ నూతన అధ్యక్షుడు మోహన్ మార్కమ్ కష్టపడి పనిచేసే వ్యక్తి, నిరాడంబరంగా ఉంటూ అందరితో కలిసిపోతారని ఆయన ప్రశంసించారు. ఈ నెల 28న సీపీసీసీ అధ్యక్షుడిగా మోహన్ మార్కమ్‌ను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment