మొన్న మొసలి, నిన్న అనకొండ, నేడు...
బెంగళూరు: నిత్యం నడిచే రోడ్డుపై ఊహించని రీతిలో అందమైన ఓ కొలను, అందులో కమలాలు విరబూసి కనువిందు చేస్తే.. అచ్చంగా ఇలాంటి దృశ్యమే గార్డెన్ సిటీ బెంగళూరులోని ఓ వీధిలో కనువిందు చేసింది. ఎపుడూ మురికి, దుర్గంధంతో ఉండే ఆరోడ్డు అకస్మాత్తుగా ముదురు ఎరుపు , గులాబీ రంగు పూలతో పాదచారులను మురిపించింది.
బెంగళూరు ప్రధాన రహదారులపై ప్రజల పాలిట మృత్యు కుహరాలుగా మారిన మ్యాన్‌హోల్స్, గోతులు, గుంటలపై అధికారుల దృష్టి నిలిపే విధంగా ఓ కళాకారుడు నిరసన వ్యక్తం చేస్తూ రూపొందించిన కళాఖండమిది. ముదురు ఎరుపు,గులాబీ, వంకాయ రంగులతో ఉన్న కమలాలు అందరినీ విపరీతంగా ఆకర్షించాయి. అవి నిజం పూలుకాదని, థెర్మాకోల్తో కృత్రిమంగా తయారు చేసినవి అని తెలిసినా నమ్మలేనంత సహజంగా అమరాయి.
కాగా నగరంలో శనివారం మున్సిపల్ ఎన్నికలు జరగున్నాయి. ఈ నేపథ్యంలో నగర పాలక యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అధ్వాన్నంగా మారిన రోడ్లను పరిస్థితిని అధికారులకు తెలిపేందుకు స్థానిక కళాకారుడు బాదల్ నంజుండస్వామి ఈ ప్రయత్నం చేశారు. గతనెల కూడా పొడవాటి మొసలి బొమ్మను రోడ్డు పక్కన ఉన్న గుంటలో ఏర్పాటు చేసి అధికారులు, మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించారు. అనంతరం భారీ సైజులో అనకొండ పట్టపగలే రోడ్డుపైన ఉన్న మ్యాన్‌హోల్ నుంచి బయటకు వచ్చి, ఓ మనిషిని మింగేస్తూ, చేయి మాత్రమే బయట మిగిలి ఉన్నదృశ్యం బెంగళూరు రోడ్డుపై బీభత్సం సృష్టించింది.
నంజుండస్వామి చేస్తున్న ఈ ప్రయత్నానికి నమ్మ బెంగళూరు ఫౌండేషన్ కూడా మద్దతు తెలిపింది. మొసలి, అనకొండల కంటే రహదారులపై గోతులు, గుంటలు, మ్యాన్‌హోల్స్ ప్రజలకు ప్రమాదకరంగా మారాయని అధికారులను హెచ్చరించారు. కాగా కర్ణాటక హైకోర్టు కూడా స్పందించింది. బెంగళూరు నగరంలోని అపరిశభ్ర వాతావరణాన్ని సరిదిద్దాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో సంబంధిత చర్యలకు బృహత్ బెంగళూరు మహానగర పాలిక అధికారులు శ్రీకారం చుట్టారు.