పింకీ.. దెయ్యమై తగలబెట్టేసింది!
దెయ్యాలు -ప్రతీకారం కథలు మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా అలాంటి సినిమా కథను మరిపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో సంచలనం రేపింది. ఆ నగరంలో గాజులు తయారుచేసే కుటుంబానికి చెందిన ఇల్లు హఠాత్తుగా తగలబడిపోయింది. ఇంట్లోని వస్తులన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. దుస్తులు, డబ్బులు, గాజుల తయారీకి ఉపయోగించే వస్తువులు ఏవీ మిగల్లేదు. సర్వం కాలి బూడిదైంది. దీంతో ఆ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో పడిపోయారు.
దీంతో పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన ఆ ఇంటి కోడలు పింకియే దెయ్యమై కుటుంబాన్ని నాశనం చేసిందని గ్రామంలో వదంతులు షికార్లు చేశాయి. మరోవైపు పింకీ తనకు కలలో చాలాసార్లు కనిపించిందని, చంపేస్తాననీ, సర్వనాశనం చేస్తానని చాలాసార్లు బెదిరించిందని పింకీ అత్తగారు వాపోతోంది. పింకి మరణం తర్వాత ఆమె భర్త నాగేంద్ర రెండోపెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా దెయ్యం పట్టి పీడిస్తోందని, నాగేంద్ర కొడుకును కూడా బలితీసుకుందని అంటున్నారు. అప్పుడే నాగేంద్ర తండ్రి మంత్రగాళ్లను సంప్రదించారని, దీంతో ఆగ్రహం చెందిన పింకీ దెయ్యం ఆ కుటుంబంపై పగ తీర్చుకుందనే వార్తలు గ్రామంలో గుప్పుమన్నాయి.
కానీ ఈ వార్తలను హేతువాద సంఘాలు కొట్టి పారేస్తున్నాయి. మండు వేసవిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ సంభవిస్తాయని.. వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.