గుర్మీత్ స్కూళ్లలో ఏం జరుగుతోంది?
గుర్మీత్ స్కూళ్లలో ఏం జరుగుతోంది?
Published Tue, Sep 5 2017 12:38 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM
సాక్షి, ఛండీగఢ్: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసులో జైలు పాలయ్యాక డేరా సచ్ఛా సౌదా వ్యవహరాలన్నీ కుంటుపడిపోయాయి. వారసురాలిగా భావించిన హనీప్రీత్ పరారీలో ఉండటం, డేరా చైర్ పర్సన్ విపస్సన ఇన్సాన్ క్రియాశీలకంగా వ్యవహరించకపోతుండటంతో డేరా కార్యకలాపాలాకు అంతరాయం కలుగుతున్నాయి. దీనికి తోడు సిస్రా పూర్తిగా భద్రతా దళాల అదుపులో ఉండటం కూడా మరో కారణంగా మారింది.
అయితే గుర్మీత్ అరెస్ట్ అయిన తర్వాత అల్లర్ల కారణంగా సిస్రాలో కర్ఫ్యూ విధించిన విషయం విదితమే. ఈ 10 రోజుల నుంచి డేరా స్కూళ్లన్నీ మూతపడిపోయాయి. ఒక్క సిస్రా డేరాలోనే కాదు.. చుట్టు పక్కల నెజియాకేరా, బెజెకన్, బెగూ గ్రామాల్లో కూడా డేరా స్కూళ్లు ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సర్దుమణగకపోవటంతో వాటిని ఇంకా తెరవలేదు. దీంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు స్కూళ్ల రీ ఓపెన్ గురించి టీచర్లకు కూడా స్పష్టమైన సమాచారం లేదని చెబుతుండటంతో వాటిని మూసేశారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే తరగతులు ఆలస్యం అయ్యాయని, పరిస్థితి ఇలాగే కొన్ని రోజులు కొనసాగితే విద్యాసంవత్సరం నష్టపోయే అవకాశం ఉందని స్కూళ్ల ప్రిన్స్ పాల్ అసోషియేషన్ చెబుతోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బృందంగా మారి జిల్లా విద్యాధికారి మునిష్ నాగ్ పాల్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
పరిస్థితులు సర్దుకుంటాయి...
మరో 10 రోజులు వేచి చూడక తప్పదని మునిష్ వారిని కోరినట్లు తెలుస్తోంది. "పరిస్థితులు సర్దుకుంటాయనే నమ్మకం ఉంది. ఈ విషయన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. విద్యార్థులకు తరగతులు ఏర్పాటు చేయమని కోరా'' అని మునిష్ చెబుతున్నారు. మొత్తం మూడు స్కూళ్లతోపాటు, రెండు జూనియర్ కళాశాలలు, ఓ బీఈడీ కాలేజీ కూడా డేరాలో ఉన్నాయి. వీటితోపాటు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని స్కూళ్లతో కలిపి సుమారు 8000 మంది విద్యార్థులు డేరా స్కూళ్లల్లో విద్యనభ్యసిస్తున్నారు.
అమ్మాయిల మిస్సింగ్ పై రియాక్షన్
డేరాలో చదువుతున్న స్థానికేతర విద్యార్థినిలను బాహ్యా ప్రపంచంతో సంబంధం లేకుండా చేయటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన కజిన్ ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారంటూ పరిమిందర్ సింగ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 20 ఏళ్ల యువతి రెండేళ్ల క్రితం బీఏ చదివేందుకు డేరా కాలేజీకి వెళ్లింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో ఆమెను కలవనీయకుండా అడ్డుకుంటున్నారు నిర్వాహకులు. కోర్సు పూర్తయిన తర్వాతే పంపిస్తామని తేల్చేశారు. మరోవైపు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి కూడా తన కూతురి విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించాడు కూడా. అయితే అమ్మాయిల తరపు నుంచి ఫిర్యాదు అందితేనే తాము స్పందిస్తామని అధికారులు చెబుతున్నారు. డేరాలో అమ్మాయిలపై గుర్మీత్ చేసిన అఘాయిత్యాల నేపథ్యంలో వారి నుంచి ఎలాంటి సమాచారం బయటికి పొక్కకుండా బంధీలను చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement