
‘ఉగ్ర’ పోరులో పరస్పర సాయం
ప్రధాని మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరుకు పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఆస్ట్రేలియా వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన టర్న్‌బుల్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఇద్దరు ప్రధానులు ఢిల్లీలోని మండి మెట్రో రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి దాదాపు 15 నిమిషాలు మెట్రో రైల్లో ప్రయాణించారు.
మెట్రో స్టేషన్ లోకి ప్రవేశిస్తున్న సమయంలో ప్రధాని మోదీ ప్రయాణికులకు అభివాదం చేశారు. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలోనే టర్న్‌బుల్ మోదీ ఇద్దరు నిల్చుని కొద్దిసేపు, కూర్చుని కొద్దిసేపు సెల్ఫీలు దిగారు. ప్రయాణిస్తున్న సమయంలోనే ఇద్దరు ప్రధానులు తమ సెల్ఫీలను ట్వీటర్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కాసేపు సరదా సంభాషణ చోటు చేసుకుంది. అనంతరం వీరిద్దరూ అక్షర్ ధామ్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు ఇద్దరు ప్రధానులను పూలమాలలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అక్షర్ ధామ్ ఆలయం లోపల ఇద్దరు కలియ తిరిగారు.
ఆస్ట్రేలియా–భారత్ మధ్య 6 ఒప్పందాలు
అంతకుముందు భారత్ ప్రధాని మోదీతో టర్న్‌బుల్ పలు అంశాలను చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష జరిపారు. ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న భారత విద్యార్థుల భద్రతతో సహా పలు అంశాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా భారత్–ఆస్ట్రేలియా దేశాలు ఆరు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇందులో ఉగ్రవాద వ్యతిరేక పోరుకు సహకరించుకోవాలన్నది ప్రధానమైనది. ఆరోగ్యం, మందులు, క్రీడలు, పర్యావరణం, వాతావరణం, విమానయాన భద్రత, స్పేస్ టెక్నాలజీ తదితర అంశాల్లో సహకరించుకోవాలని ఒప్పందాలు చేసుకున్నారు.
లాంఛనప్రాయమైన రాష్ట్రపతి భవన్‌లో విందు సందర్భంగా టర్న్‌బుల్ విలేకరులతో మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియాలోని 5 లక్షలమందికి భారత నేపథ్యముంది. ఇరుదేశాలు ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి’అని అన్నారు. అంతేకాదు ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ‘ప్రధాని మోదీ ఈ దేశాన్ని ఎంతో అసాధారణమైన రీతిలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. భారత్ సాధించిన విజయాలు యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. భారత్‌తో మరింత సన్నిహితంగా కలసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు.
డీఆర్‌ఎస్‌పై సరదా సంభాషణ
ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి మధ్య డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్)పై వివాదం జరిగిన నేపథ్యంలో దీనిపై భారత్, ఆస్ట్రేలియా ప్రధానులు మోదీ, టర్న్‌బుల్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య ఒప్పందాలను మోదీ క్రికెట్ పరిభాషలో చెబుతూ ‘మా నిర్ణయాలు డీఆర్‌ఎస్ రివ్యూ పరిధిలోకి రానందుకు సంతోషం’ అని చమత్కరించారు.