ఆ హత్య పీటర్కు ముందే తెలుసా?
ముంబయి: షీనా బోరా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. తన తండ్రికి షీనా బోరా హత్యకు ఏ సంబంధం లేదని, ఆయన అమాయకుడని పీటర్ ముఖర్జియా తనయుడు రాహుల్ ముఖర్జియా చెప్పిన మరుసటి రోజే సీబీఐ వెల్లడించిన కొన్ని విషయాలు పీటర్కు షీనా హత్యకు ఏవో సబంధాలున్నాయని పరోక్షంగా చెబుతున్నాయి. షీనా చనిపోయిందన్న విషయం పీటర్ ముఖర్జియాకు ముందే తెలుసని సీబీఐ వర్గాలు పరోక్షంగా చెబుతున్నాయి. అందుకే కావాలని పోలీసు అధికారి దేవెన్ భారతీని కలిశారని, కనిపించకుండా పోయినా షీనా ఫోన్ కాల్ డేటా తమకు ఇవ్వాలని, ఆమె ఎక్కడ ఉందో గుర్తించాలని ఆయనను కోరినట్లు సీబీఐ అధికారులు దాఖలు చేసిన చార్జిషీటులో పేర్కొన్నారు.
ఈ హత్యను ఒక మిస్సింగ్ కేసుగా మార్చే ప్రయత్నం ఇంద్రాణి, పీటర్ చేసినట్లు సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో గత ఆగస్టులోనే షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేయగా పీటర్ ను గత వారం అరెస్టు చేశారు. సీబీఐ వర్గాలు విశ్వసిస్తున్న ప్రకారం షీనా చనిపోయిన విషయం ముందే తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదుచేసేందుకు ప్రయత్నించిన రాహుల్ ముఖర్జియాను కూడా తప్పుదోవపట్టించాడని తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఇంద్రాణి, పీటర్ సంప్రదించిన పోలీసులు అధికారి భారతీని ఈ కేసులో ఆధారంగా చేర్చారు.