
ఆ బాలికకు బాబు పుట్టాడు!
సాక్షి, ముంభై: అత్యాచార బాధితురాలు, మైనర్ బాలిక(13) మగబిడ్డకు జన్మనిచ్చింది. సుప్రీంకోర్టు ఆమె గర్భ స్రావానికి అనుమతి ఇచ్చిన అనంతరం వైద్యులు ఆమెకు సిజేరియన్ చేశారు. కోర్టు అనుమతి ఇచ్చిన రెండు రోజుల తరువాత వైద్యులు శుక్రవారం ఈ ఆపరేషన్ నిర్వహించారు. తండ్రి స్నేహితుడి దుర్మార్గానికి బలై, ముక్కుపచ్చలారని ప్రాయంలో బిడ్డకు తల్లి అయింది.
బాలిక వయస్సు, బాలిక ఆరోగ్యం కారణం నంగా సాధారణ డెలివరీ సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ పద్ధతిని ఎంచుకున్నామని ముంబై జేజే ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నెలలు నిండని కారణంగా బాబు తక్కువ బరువుతో (1.8కిలోలు) పుట్టాడని, దీంతో నవజాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు) లో ఉంచినట్టు చెప్పారు. శిశువు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, అలాగే బాలిక కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. గైనాలజీ విభాగం అధిపతి డా. అశోక్ ఆనంద్ చెప్పారు. అయితే బిడ్డను తమతో ఉంచుకోవాలా లేదా అనేది బాలిక కుటుంబం ఇంకా నిర్ధారించుకోలేదు.
బాలిక మానసిక పరిస్థితి, మెడికల్ బోర్డు నివేదికను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం అబార్షన్‌కు అనుమతి ఇచ్చింది. 31 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో తల్లి ప్రాణానికి కూడా ముప్పు రావచ్చని మెడికల్ బోర్డు హెచ్చరించినప్పటికీ.. అబార్షన్ చేయించడానికి సుప్రీం కోర్టు అంగీకరించింది.
కాగా ఏడు నెలల క్రితం బాలికపై ఆమె తండ్రి వ్యాపార భాగస్వామి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక బరువు పెరగడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆగష్టులో హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. 27 వారాల గర్భంతో ఉందని డాక్టర్లు తేల్చారు. దీంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు నిందితుడు అంగీకరించిన సంగతి తెలిసిందే.