ఆగ్రాలోని ప్రభుత్వ మానసిక వైద్యశాల ప్రవేశ ద్వారం
ఇప్పటి ఏపీ సీఎం.. అప్పుడెప్పుడో చెప్పిన మాటను ఉత్తరప్రదేశ్ సర్కారు వంటబట్టించుకుంది! 'రైతులు ఆత్మహత్యలు చేసుకునేది మానసిక సమస్యలతోనేగానీ ప్రభుత్వాల వైఫల్యంతో కాదు' అని నిర్ధారణకు వచ్చింది. అందుకే మెంటల్ హాస్పిటళ్లలో ప్రత్యేక వార్డులు తెరిచి రైతులకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైంది! ఆ క్రమంలోనే మొదటి విడతగా ఆగ్రా పట్టణంలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో స్పెషల్ వార్డును ప్రారంభించింది. ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలున్న రైతుల్ని గుర్తించి.. ఆసుపత్రికి తీసుకొచ్చి.. పంట నష్టపోతే ఆందోళనకు గురికావద్దని, చనిపోవాలనే ఆలోచన వస్తే భార్యాబిడ్డల్ని తలుచుకోవాలని మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు మానసిక వైద్యులు!
అదేంటి..ఒట్టి మాటలే చెబుతారా? గట్టి మేలేదీ చెయ్యరా? అనే ప్రశ్నలకు.. 'ఆత్మహత్యలు నివారించేందుకు మేం చేయగలిన ప్రయత్నాలన్నీ చేశాం. చనిపోయిన రైతుల జాబితాతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రానికి లేఖలు రాశాం. రూ. 3,500 కోట్ల సహాయం అందిస్తే సమస్యలు కొద్దివరకు పరిష్కారమవుతాయిని ఆశిస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం మా విజ్ఞప్తుల్ని పట్టించుకోవట్లేదు' అని ప్రభుత్వాధికారులు సమాధానమిచ్చారు. ఉత్తరప్రదేశ్లోని 65 జిల్లాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో దాదాపు 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు అఖిలేశ్ సర్కార్ అధికారికంగా వెల్లడించింది. అన్నదాతకు మనోస్థైర్యం పెంచేందుకు అన్ని మెంటల్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు తెరవాలనుకుంటోంది.