న్యూఢిల్లీ: రాజ్యసభలో గుండెపోటుతో కుప్పకూలి అనంతరం ప్రాణాలు కోల్పోయిన మాజీ కేంద్రమంత్రి ఈ అహ్మద్ మరణం ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా జాప్యం చేసిందని, ఆటలాడుకున్న పరిస్థితి కనిపించిందని సీపీఎం సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన రాజ్యసభలో జీరో అవర్ సమయంలో ఈ అంశంపై ప్రశ్నను లేవనెత్తారు.
తనకు పలువురు వైద్యుల నుంచి సమాచారం ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయానికే అహ్మద్ చనిపోయాడని చెప్పారని, ఇంకొంతమంది మాత్రం అహ్మద్ ఐసీయూలో చనిపోయాడని చెప్పారని అన్నారు. ఏదేమైనా ఆయన మరణంపై చాలా ఆలస్యంగా కేంద్రం నుంచి ప్రకటన వెలువడిందని, వైద్యుల నుంచి భిన్నమైన సమాధానాలు వచ్చాయని ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసి నిజనిజాలు తెలిపాల్సిన అవసరం ఉందని ఆయన స్పీకర్‌ను కోరారు.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక రోజు ముందు మాజీ కేబినెట్ మంత్రి అహ్మద్ గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను ఒక రోజు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కేంద్రం బడ్జెట్ పెట్టింది. ఈ సమయంలో సీతారాం ఏచూరి దర్యాప్తు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘మాజీ ఎంపీ మరణవార్త ఎందుకు లేటయింది?’
Published Fri, Feb 3 2017 4:31 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
Advertisement
Advertisement