న్యూఢిల్లీ: దేశంలో స్త్రీలు, బాలికలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో.. మహిళల సాధికారతకు చట్టాలు చేయడం, పథకాలు ప్రకటించడం మాత్రమే సరిపోదని, అవి క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కూడా చూడాలని యూపీఏ చైర్‌పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. మహిళలకు వివిధ సమస్యలపై, హక్కులపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ‘అహింసా సందేశకుడు (అహింస మెసెంజర్)’ పథకాన్ని శనివారమిక్కడ సోనియా ప్రారంభించారు.
అనంతరం ప్రసంగిస్తూ.. స్త్రీలు, బాలికలపై అన్ని రకాల హింసనూ అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, అప్పుడే వారు సురక్షితంగా, నిర్భయంగా ఉండటంతోపాటు సాధికారతనూ పొందుతారన్నారు. పథకంలో భాగంగా.. దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్లు, ఇతరులను వలంటీర్లుగా ఎంపిక చేసి, వారి ద్వారా మహిళలకు అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు.