పళనికి కొత్త టెన్షన్.. 40 మంది ఎమ్మెల్యేలు జంప్?
చెన్నై: వర్గ పోరులకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్ సెల్వంలు విలీన నిర్ణయం తీసుకోగానే తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. శశికళ మరియు ఆమె వర్గీయులపై వేటు వేయటమే ప్రధాన ఉద్ధేశ్యంగా రొయపెట్టాలో సోమవారం నిర్వహిస్తున్న కీలక సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పళని, పన్నీర్‌లలో కొత్త టెన్షన్ మొదలుకాగా, పార్టీలో సంక్షోభం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
శశికళ బంధువు దినకరన్ టీవీవీ దినకరన్ తన వర్గ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగరవేయగా ప్రస్తుతం సుమారు 22 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని విండ్‌ఫ్లవర్ రిసార్ట్‌లో సేదతీరుతున్నారు. రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని, తామంతా దినకరన్ వెంటే నడుస్తామని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మద్ధతుగా వ్యవహరించబోతున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పళని-పన్నీర్ వర్గంలో మరింత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, వారంతా త్వరలో దినకరన్ గూటికి చేరతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పారదర్శకంగా వ్యవహరించి అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహిస్తారని ఆశిస్తున్నామని, అలాకానీ పక్షంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సెల్వన్ కోరారు. ఇక పళని స్వామి సహా నేతలంతా కీలక బాధ్యతల నుంచి తొలగిస్తూ వస్తున్న దినకరన్ నేడు మరోకరిపై వేటు వేశారు. విద్యుత్ శాఖ మంత్రి పి తంగమణిని నమక్కల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ ఆ స్థానంలో అనబఝన్‌ను నియమించారు.
అన్నాడీఎంకే సమావేశంలో నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. శశికళ, దినకరన్ లను వెలివేయటంతోపాటు, దినకరన్ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దినకరన్ చేతల్లో ఉన్న పార్టీ అధికారిక మీడియాలు నమదు ఎంజీఆర్, జయ టీవీల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇక త్వరలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలని తీర్మానాలు చేసింది.
డీఎంకే-దినకరన్‌ల కాంబోలో ప్రభుత్వం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో టీవీవీ దినకరన్ చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కొందరు శకునిలు పళని-పన్నీర్‌లను ఒక్కటి చేసేందుకు తీవ్రంగా యత్నించాయని, కానీ వారి ఆటలు సాగకపోవచ్చని ఆయన ట్వీట్ చేశారు.
ఇంకోవైపు దినకరన్‌కు మద్ధతు ఇస్తున్న 19 మంది ఎమ్మెల్యేలతోపాటు గుట్కా స్కాం అంశాన్ని వెలుగులోకి తెస్తూ డీఎంకేలోని 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పళని ప్రభుత్వం స్పీకర్‌ను కోరే అవకాశం ఉందని, తద్వారా సభలో కోరంను తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.