నేను ముఖ్యమంత్రి కావడం ఖాయం
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ స్పష్టీకరణ
- జయలలిత తరహాలోనే పాలన అందిస్తా..
- పన్నీర్‌సెల్వం పచ్చిద్రోహి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో ఉంటూ, ‘అమ్మ’ అండతో ఎదిగిన పన్నీర్‌సెల్వం పచ్చి ద్రోహిగా వ్యవహరిస్తున్నారని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నిప్పులు చెరిగారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నందున తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఒక ప్రైవేట్ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె పలు అంశాలపై స్పందించారు.
గవర్నర్‌ను నమ్మాను
‘‘ఈ నెల 5వ తేదీన అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్యేల సమావే శంలో నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నిక య్యా. తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్ విద్యాసా గర్‌రావు ఆ రోజు ఊటీలో ఉన్నట్లు తెలిసింది. నేను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తీర్మాన ప్రతిని ఊటీలోని గవర్నర్ క్యాంప్ కార్యాల యానికి ఫ్యాక్స్ ద్వారా పంపాను. అయితే, ఆయన ఊటీ నుంచి ముంబైకి వెళ్లిపోవడంతో అక్కడి రాజ్‌భవన్‌కు తీర్మాన ప్రతిని మరోసారి పంపించాను. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయా ల్సిందిగా నన్ను ఆదేశించడంలో జరుగుతున్న జాప్యం వెనుక రాజకీయం ఉందని నేను ఊహించలేదు. చట్టప్రకారం, ప్రజాస్వామ్య పద్ధతిలో గవర్నర్ వ్యవహరిస్తారని నమ్మాను. అన్నాడీఎంకేకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు నన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్ను కున్నందున ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని నమ్మకంతో ఎదురు చూశాను’’ అని శశికళ చెప్పారు.
పన్నీర్ సెల్వం వెనుక డీఎంకే
‘‘మీకు అండగా మేమున్నామని అసెంబ్లీలో పన్నీర్‌సెల్వంను ఉద్దేశించి డీఎంకే సభ్యులు అన్నప్పుడు.. పూర్తి మెజారిటీతో మేము అధికారంలోకి వచ్చాం, మీ అండ మాకు అవసరం లేదని ఆయన బదులివ్వకుండా నింపాదిగా కూర్చున్నారు. పన్నీర్‌సెల్వం మళ్లీ అధికారంలోకి వస్తారని ప్రతిపక్ష నేత స్టాలిన్ అంటున్నారు. పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేకు చెందిన వ్యక్తి అని ప్రతిపక్ష డీఎంకే భావించడం లేదు. మీకు అండగా మేమున్నామని అసెంబ్లీలో అన్నప్పుడే పన్నీర్‌సెల్వం వెనుక డీఎంకే ఉందని రుజువైంది. ఈ సంఘటన తరువాతే నన్ను సీఎం చేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. డీఎంకే పట్ల జయలలిత ఎలా వ్యవహరించేవారో నేను సైతం అలాగే ఉంటున్నాను’’ అని చిన్నమ్మ వివరించారు.
అమ్మ మరణంపై ఉద్దేశపూర్వక రాద్ధాంతం
‘‘ఆసుపత్రిలో ‘అమ్మ’కు జరిగిన చికిత్సపై డీఎంకే నేతలు ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 75 రోజులపాటు ఆసు పత్రిలో ఉన్న జయను ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అక్కడి వైద్యులకు తెలుసు. నా గురించి అవాకులు చవాకులు పేలే వారిని పట్టించుకోకుండా మనస్సాక్షి ప్రకారం నడుచు కుంటున్నాను. ‘అమ్మ’ను దూరం చేసుకుని జీవించడం ఎంతటి దుర్లభమో నాకు తెలుసు. ఇన్నాళ్లూ మాతో ఉన్న పన్నీర్‌సెల్వం ఇప్పుడు ‘అమ్మ’కు జరిగిన చికిత్సపై విచారణ కమిషన్ వేయాలని కోరడం బా«ధాకరం. ‘అమ్మ’కు గుండెపోటు వచ్చిన రోజు కూడా ఫిజియో థెరపీ చేశారు. ఆ రోజున ‘అమ్మ’ టీవీ చూస్తున్నారు, 29వ తేదీన ఇంటికి తీసుకెళ్లాల ని నిర్ణయించుకున్నాను.
అయితే ఈలోగా మరణం సంభవించింది. జయలలిత మరణం పై విచారణ కమిషన్ వేయాలని కోరినందుకు నాకు బాధలేదు, ‘అమ్మ’కు పన్నీర్ చేస్తున్న పచ్చి ద్రోహమే నన్ను బాధిస్తోంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తానని నమ్మకంగా చెబుతున్నాను. తమిళనాడు ప్రజలకు జయలలిత ఏమి చేయాలని ఆశించా రో.. నేను కూడా అదే తరహా పాలన అందిస్తా ను. ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతున్నం దున కోర్టు అంశాలపై నేనేమీ వ్యాఖ్యానించ ను’’ అని శశికళ పేర్కొన్నారు.
మమ్మల్ని బంధించలేదు: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
చెన్నై: తమను ఎవరూ నిర్బంధించలేదని శశికళ శిబిరంలోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుS తెలిపారు. తాము బస చేసిన రిసార్ట్ వద్ద కొందరు ఎమ్మెల్యేలు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మమ్మల్ని ఎవరూ బంధించలేదు. మమ్మల్ని శశికళ దాచిపెట్టారంటూ ప్రతిపక్ష డీఎంకే అసత్యాలు ప్రచారం చేస్తోంది. బెదిరింపులు వస్తుండడం వల్లే సెల్‌ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నాం’’ అని వెల్లడించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఆచూకీ కనిపెట్టాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పలువురు వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.