మా కూరల్లో ఉప్పు ఉంది: ఎంపీల మద్దతు ఓపీఎస్‌కే
మా కూరల్లో ఉప్పు ఉంది: ఎంపీల మద్దతు ఓపీఎస్‌కే
Published Sat, Feb 11 2017 5:38 PM | Last Updated on Mon, Apr 8 2019 7:05 PM
చెన్నై: తమిళనాడు రాజకీయాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. తాజాగా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మినహా ఎంపీలంతా సెల్వం గూటికి చేరుతున్నట్లు ఇద్దరు ఎంపీలు పేర్కొన్నారు. పొద్దన లేస్తే నియోజకవర్గంలో తిరగాలని.. అలా జరగాలంటే పన్నీరు సెల్వం క్యాంపులో చేరడమే మంచిదని ఎంపీ అశోక్‌కుమార్ అన్నారు. ప్రత్యర్ధి వర్గంలోకి చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా? అని ప్రజలు తనను ప్రశ్నిస్తారని చెప్పారు. జయ మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అమ్మ తమను వదిలిన రోజున అందరూ కన్నీటి సంద్రంలో మునిగిపోతే శశికళ మాత్రం 15మంది కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చారని మరో ఎంపీ సుందరం అన్నారు. తాము ఒకరినొకరు చూసుకునే లోపే వారందరూ వచ్చి తర్వాతి ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చలు మొదలుపెట్టినట్లు తెలిపారు. శశికళ కంట్లో నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రాలలేదని ఆవేదన చెందారు. అమ్మను దగ్గరగా చూసేందుకు కూడా శశికళ అనుమతించలేదని చెప్పారు.
Advertisement