విలీనం: హుటాహుటిన తమిళనాడుకు గవర్నర్
చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు చర్చలు ఆశాజనకంగా సాగి.. సీట్ల పందేరాలు కొలిక్కి రావడంతో సీఎం పళనిస్వామి (ఈపీఎస్), మాజీ సీఎం పన్నీర్ సేల్వం (ఓపీఎస్) నేతృత్వంలోని ఈ రెండు శిబిరాలు విలీనం దిశగా కదులుతున్నాయి. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన చేసేందుకు తగిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సోమవారం హుటాహుటిన చెన్నైకి బయలుదేరడం గమనార్హం. ముంబైలో ఉన్న ఆయన సోమవారం నాటి తన అపాయింట్‌మెంట్లనీ రద్దు చేసుకొని.. చెన్నై బయలుదేరారని గవర్నర్ పీఆర్‌వో తెలిపారు. అన్నాడీఎంకేలోని ఈపీఎస్-ఓపీఎస్ శిబిరాల విలీనం నేపథ్యంలోనే ఆయన తమిళనాడు వస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు విలీన ప్రక్రియ జోరందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతల అత్యవసర భేటీకి పళని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం వేదికగా చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి సాగనంపబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ చర్యల్ని అడ్డుకునే రీతిలో న్యాయ పోరాటానికి దినకరన్ కసరత్తుల్లో పడడంతో ఉత్కంఠ పెరిగింది.
రాయపేట కార్యాలయం నుంచి అన్నాడీఎంకే కార్యవర్గంలోని ప్రధాన సభ్యులందరికీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు సీఎం పళని ఆదేశాలు అందడంతో అందరూ చెన్నైకి చేరుకునే పనిలో పడ్డారు. ఉదయం పదిన్నర గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. పన్నీరు పెట్టిన షరతుల్లో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ తొలగింపు ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండింటినీ నెరవేర్చడం లక్ష్యంగా చట్టపరంగా అన్నాడీఎంకే నిబంధనల్లో సవరణలకు సిద్ధం అవుతూ ఈ సమావేశానికి పిలుపునిచ్చినట్టు సమాచారం. అదే సమయంలో పన్నీరు శిబిరంలో ఉన్న మధుసూదనన్ అన్నాడీఎంకే నిబంధనల మేరకు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న దృష్ట్యా, ఆయన అధ్యక్షతన తాజా సమావేశానికి ఏర్పాట్లు చేసినట్టుగా తెలిసింది.
చిన్నమ్మను సాగనంపుతూ తీర్మానం వెలువడ్డ కొన్ని క్షణాల్లో పన్నీరు పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సోమవారం అమావాస్య రావడం. ఈ రోజును తమిళులు శుభకరంగా భావిస్తుండడంతో విలీనం కూడా అదేరోజు సాగడం ఖాయం అన్న ప్రచారం ఊపందుకుంది. ఇక, పన్నీరుకు పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం, మరో ఇద్దరికి మంత్రి పదవుల శాఖలు సిద్ధం చేసినట్టు తెలిసింది.