వీడని ఉత్కంఠ
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేదెవరో అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా రాజ్‌భవన్ చుట్టూ రాజకీయం సాగింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన కె పళనిసామి మరో మారు వేర్వేరుగా గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. గార్డెన్ నుంచి బయలు దేరి అమ్మ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం చిన్నమ్మ శశికళ బెంగళూరు కోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె శిబిరం తీవ్ర విషాదంలో మునిగింది.
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో రాజకీయ పోరు ఉత్కంఠ భరితంగానే సాగుతోంది. చిన్నమ్మ శశికళకు జైలు శిక్ష పడడం ఆమె శిబిరాన్ని ఢీలా పడేలా చేసింది.అయినా, సేనలకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చిన చిన్నమ్మ శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. అక్కడున్న మద్దతుదారులు చిన్నమ్మకు ఎదురైన కష్టాన్ని తలచుకుని ఉద్వేగానికి గురయ్యారు. తన కంట నీరు సుడులు తిరుగుతున్నా, బయటకు రానివ్వకుండా, మద్దతుదారులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చిన్నమ్మ చేశారు. చివరకు సెలవంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. నేరుగా మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్ద, రామాపురం తోట్టంలోని ఎంజీఆర్ ఇంటి వద్ద కాసేపు మౌనంగా కూర్చున్నారు. అక్కడి నుంచి ఆమె బెంగళూరుకు పయనం అవుతున్న వేళ, మద్దతు దారుల హృదయాలు బరువెక్కాయి. కంటి నుంచి నీటి ధార పొంగింది. ముందుగా, చిన్నమ్మ జైలుకు వెళ్లనుండడంతో పార్టీ పరంగా తమకు పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారో అని మద్దతుదారులు ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా టీటీవీ దినకరన్ తెర మీదకు రావడం ఆ శిబిరానికి ఊరట.
దినకరన్ చేతిలో అధికారం:
అధికారం తన విధేయుడు పళనిసామి చేతికి చేరిన పక్షంలో, జైలు నుంచే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు తగ్గ వ్యూహంతో చిన్నమ్మ బెంగళూరుకు బయలు దేరి వెళ్లారు. తన సోదరి వనిత వాణి కుమారుడు టీటీ దినకరన్ చేతిలో పార్టీని ఉంచడం, సర్వాధికారాల్ని అప్పగించి వెళ్లడంతో ఇక, శశికళ కుటుంబ రాజకీయ హవా చిన్నమ్మ శిబిరంలో మరింతగా పెరిగినట్టే. అదే సమయంలో దినకరన్‌కు చిన్నమ్మ శిబిరంలో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మున్ముందు ఈ శిబిరంలో ఆసక్తికర మలుపులకు అవకాశాలు ఎక్కువే. ఇక, ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ, కిడ్నాప్‌నకు గురయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించినానంతరం చిన్నమ్మ శిబిరంపై కేసుల మోత మోగించే పనిలో పోలీసులు పడటం గమనార్హం.
పన్నీరు శిబిరంలో సందడి కరువు:
చిన్నమ్మ శిబిరంలోఉద్వేగ భరిత వాతావరణం చోటు చేసుకుంటే, గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరంలో సందడి కరువు అయింది. నిన్నటి వరకు పెద్ద సంఖ్యలో మద్దతు దారులు తరలి రాగా, బుధవారం సంఖ్య తగ్గింది. సినీ నటి గౌతమి అక్కడికి వచ్చిన పన్నీరు మద్దతు పలికారు. ముఖ్య నేతలతో పన్నీరు సమాలోచనలో బిజీబిజీ అయ్యారు.
కూవత్తూరులో ...:
కూవత్తూరులోని క్యాంప్ ఆవరణలో మధ్యాహ్న సమయంలో హై టెన్షన్ వాతావరణం కాసేపు నెలకొంది. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పోలీసు బలగాలు క్యాంప్ వైపుగా దూసుకు రావడంతో శిబిరాన్ని ఖాళీ చేయిస్తారా..?అన్న ఉత్కంఠ తప్పలేదు. చిన్నమ్మ శిబిరంలోని ఎమ్మెల్యేలు కిడ్నాప్‌నకు గురయ్యారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో, అందుకు తగ్గ చర్యలు ఏదేని చేపట్టనున్నారా అన్న ప్రశ్న బయలు దేరింది. చివరకు ఉత్కంఠ వీడినా, చిన్నమ్మకు విశ్వాసంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి, తాము ఆనందంగా, స్వతంత్రంగా ఉన్నామని, తమను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. గవర్నర్ నుంచి పిలుపు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.
రాజ్ భవన్ చుట్టూ:
అన్నాడీఎంకే రాజకీయ సమరం రాజ్‌భవన్ చుట్టూ సాగింది. తమను ఆహ్వానిస్తారా...తమను ఆహ్వానిస్తారా..? అన్న ఎదురు చూపుల్లో రెండు శిబిరాలు సాయంత్రం వరకు నిమగ్నమయ్యాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా న్యాయ నిపుణులతో గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్ రావు సంప్రదింపుల్లోనే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సాయంత్రం పళనిస్వామి గవర్నర్‌తో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా ఎలాంటి నిర్ణయాలు, హామీలు గవర్నర్ నుంచి రాలేదు. తదుపరి ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, మంత్రి పాండియరాజన్ రాజ్‌భవన్‌లో అడుగు పెట్టడంతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అయితే, ఇవన్నీ కేవలం భేటీలుగా మిగిలినా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలక మలుపులు తిరిగేనా అన్న చర్చ బయలు దేరింది. కొన సాగుతున్న ఉత్కంఠకు తెర పడేది ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో రాజకీయ వర్గాలు, రాష్ట్ర ప్రజలు నిమగ్నమయ్యారు.