పళని–పన్నీరు వర్గాల విలీనం!
అన్నాడీఎంకేలో వేగంగా మారుతున్న సమీకరణాలు
► దినకరన్ నియామకం చెల్లదని సీఎం నేతృత్వంలో పార్టీ తీర్మానం
► అమ్మ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని ప్రకటన
► శశికళకు వ్యతిరేకంగా గళం ∙15 లోపు విలీన ప్రకటన!
సాక్షి, చెన్నై: తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్య మంత్రి పళనిస్వామి– మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గాల విలీనం దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నియా మకం చెల్లదని సీఎం నేతృత్వంలో సమావేశమైన అన్నాడీఎంకే అమ్మ శిబిరం ప్రకటించింది. ఆయన తీసుకునే నిర్ణయాలతో పార్టీకి సంబంధం లేదంటూ గురువారం జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో తీర్మానం చేసింది.
అలాగే... ‘అమ్మ’ జయలలిత శాశ్వత ప్రధాన కార్యదర్శి అని, ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమని శశికళకు వ్యతిరేకంగా గళాన్ని విప్పింది. మరోవైపు పన్నీరు శిబిరంతో విలీనంపైనా చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తానికి ఈ నెల 15లోపు ఇరు వర్గాల విలీనం జరగవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది కార్యరూపం దాలుస్తుందని ఆర్థిక మంత్రి డి.జయకుమార్ ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వ్యవహారంలో బీజేపీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే పార్టీ ఇంకా తన నియంత్రణలోనే ఉందని అన్నాడీఎంకే చీఫ్ శశికళ మేనల్లుడైన దినకరన్ చెప్పారు. కాగా, అమ్మ పురచ్చితలైవి శిబిరానికి నిర్వాహకులుగా మరి కొందర్ని నియ మిస్తూ ఆయన ప్రకటన విడుదల చేయడం గమనార్హం. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీఎం పళని స్వామిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దినకరన్ హెచ్చరించారు.
కొత్త శిబిరంతో రాజుకున్న రగడ
గతంలో పన్నీరు సెల్వం నేతృత్వంలో పురచ్చితలైవి శిబిరం, సీఎం పళని స్వామి నేతృత్వంలో అమ్మ శిబిరంగా అన్నాడీఎంకే వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. తాజాగా, సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టేలా అమ్మ శిబిరం ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ పావులు కదిపే పనిలో పడ్డారు. సీఎం మద్దతుదారులు ఎదురుదాడికి దిగడంతో అమ్మ పురచ్చితలైవి పేరుతో కొత్త శిబిరాన్ని దినకరన్ ప్రకటించారు. దీంతో అమ్మ శిబిరంలో వివాదం ముదిరింది. అలాగే, దినకరన్ దూకుడు పెంచి కొత్త కార్యవర్గాల్ని ప్రకటించే పనిలో పడ్డారు. ఫలితంగా దినకరన్‌కు చెక్ పెట్టేందుకు సీఎం పావులు కదిపారు.
అమ్మే శాశ్వత ప్రధాన కార్యదర్శి
అన్నాడీఎంకే అమ్మ శిబిరం అత్యవసర కార్యవర్గ సమావేశానికి పళనిస్వామి గురువారం పిలుపు నిచ్చారు. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం సాగింది. రాష్ట్ర మంత్రులు, గతంలో జయలలిత ప్రకటించిన మేరకు అన్నాడీఎంకే కార్యవర్గంలోని 36 మందిలో 27 మంది హాజరయ్యారు. ఇందులో నలుగురు పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న దృష్ట్యా, గైర్హాజరయ్యారు. మిగిలిన ఐదుగురు పన్నీరు సెల్వం శిబిరంలో ఉన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తీర్మానాలుగా ప్రకటించారు.
ఇందులో కేవలం అమ్మ జయలలిత గతంలో నియమించిన కమిటీ మాత్రమే సంతకాలు చేసింది. ఆ మేరకు అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అని పేర్కొంటూ, ఆమె స్థానంలో మరొకర్ని ఊహించుకోలేమని ప్రకటించారు. ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకం నిబంధనలకు విరుద్ధమని, అది చెల్లదని తీర్మానించారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పదవికి కొత్త వారిని ఎన్నుకొనే వరకే పరిమితమని ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశంలో ఆమోదించారు. కాగా, శశికళ నియామకాన్ని తాము ఇంకా అంగీకరించలేదంటూ ఎన్నికల యంత్రాంగం వివరణ ఇవ్వడం గమనార్హం.
ఢిల్లీలో కీలక ప్రకటన!
ఇదిలా ఉండగగా, పళని స్వామి, పన్నీరు సెల్వం వేర్వేరుగా గురువారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం అక్కడ జరిగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తదుపరి ఇరువురు నేతలూ కీలక ప్రకటన చేయవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
పన్నీరు డిప్యూటీ సీఎం!
అమ్మ ఆశయ సాధనే లక్ష్యంగా ఒకే వేదికగా ముందుకు సాగుదామని మాజీ సీఎం పన్నీరు సెల్వం శిబిరానికి ఈ సందర్భంగా పళని వర్గం పిలుపునివ్వడం కీలక పరిణామం. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎంపీ వైద్యలింగం మీడియాకు వివరించారు. పన్నీరు శిబిరం సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తమకు ఆహ్వానం పలికే విధంగా అమ్మ శిబిరం స్పందిం చడంతో తదుపరి కార్యాచరణ దిశగా మద్దతుదా రులతో పన్నీరు మంతనాల్లో మునిగిపోయారు.
తమ డిమాండ్లు నెరవేరిస్తేనే చర్చలకు వెళతా మని ఆయన శిబిరం పునరుద్ఘాటించింది. దినకర న్‌తో చేతులు కలిపిన వారికి ఇది కనువిప్పని పన్నీరు మద్దతుదారుడు కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. విలీనానికి తమ ప్రధాన డిమాండ్లలో ఒకటైన దినకరన్‌పై వేటు నెరవేరిందన్నారు. విలీనమే జరిగితే పన్నీరు సెల్వంకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నట్టు తీవ్ర ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్ని మునుస్వామి తోసిపుచ్చారు.