గత అసెంబ్లీ ఎన్నికల తరువాత ముక్కలు చెక్కలైన అన్నాడీఎంకేలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే పారీ్టపై పట్టు కోసం నానా పాట్లు పడుతున్న పళని స్వామి, పన్నీరు సెల్వం ఈరోడ్ ఉప ఎన్నికల బరిలో తమ అనుచరులను నిలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బుధవారం తమ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ధర్మానికి కట్టుబడి బీజేపీ ఏ వర్గానికి మద్దతు ఇస్తుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీకి పయనమయ్యారు.
సాక్షి, చెన్నై: ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర తర్జనభర్జల మధ్య అన్నాడీఎంకేలోని ఇరు వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి శిబిరం నుంచి మాజీ ఎమ్మెల్యే తెన్నరసు పోటీకి దిగారు. ఆ పార్టీ సమన్వయ కమిటీ కనీ్వనర్ పన్నీరు సెల్వం శిబిరం అభ్యరి్థగా సెంథిల్ మురుగన్ రంగంలోకి వచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలంగోవన్‌కు మద్దతుగా డీఎంకే కూటమి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇక డీఎండీకే అభ్యర్థి ఆనందన్, అన్నాడీఎంకేలో చీలికతో ఆవిర్భవించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థిగా శివ ప్రశాంత్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తొలి రెండు రోజులు 10 మంది వరకు స్వతంత్ర అభ్యర్థులే బరిలో దిగారు.
బీజేపీ బరిలో దిగితే..
ఉదయాన్నే పళని తమ అభ్యర్థిని.. ప్రకటించారో లేదో.. సాయంత్రానికి పన్నీరు సెల్వం సైతం తమ వర్గం నేత పేరును వెల్లడించారు. సెంథిల్‌కుమార్ పోటీ చేస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి పన్నీరు సెల్వం మరోసారి ఆహా్వనం పలికారు. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన పక్షంలో, తమ వర్గం వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం గమనార్హం.
హస్తినకు అన్నామలై..
సంకీర్ణ ధర్మంలో భాగంగా అన్నాడీఎంకేకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సహకారం అందించేది పన్నీరు శిబిరానికా, పళని శిబిరానికా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గత రెండు రోజులుగా చెన్నైలో ఈ విషయంపై అన్నామలై పార్టీ వర్గాలతో సుదీర్ఘంగా చర్చించారు. ఇక అధిష్టానంతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన ఢిల్లీ బయలు దేరి వెళ్లినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం గురు లేదా శుక్రవారం బీజేపీ తన నిర్ణయాన్ని తెలియజేసే అవకాశం ఉంది.
నువ్వానేనా..
అన్నాడీఎంకేలో పళని, పన్నీరు శిబిరాల మధ్య ఉన్న విభేదాలు ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమికి అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. రెండాకుల గుర్తు, బీజేపీ మద్దతు కోసం ఇరు శిబిరాలు గత కొన్ని రోజులుగా పావులు కదుపుతున్నాయి. చివరకు ఎవరు సహకారం అందించినా, అందించకున్నా.. తన బలాన్ని చాటే విధంగా పళణి స్వామి బుధవారం తమ అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే, ధన బలం కలిగిన తెన్నరసును రంగంలోకి దించారు. ఇతడి పేరును మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ప్రకటించారు. అన్నాడీఎంకేలో ఈరోడ్ తూర్పు సీటు కోసం పది మందికి పైగా నేతలు పోటీ పడ్డారని, వీరిలో ఒకరిని ఎంపిక చేయడంలో జాప్యం తప్పలేదన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి 50 వేల మెజారిటీతో విజయకేతనం ఎగుర వేయడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేశారు. తన పేరు ఖరారు చేయడంతో సేలంలో ఉన్న పళనిస్వామిని కలిసి తెన్నరసు ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సెంగోట్టయన్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో తప్పక విజయపబావుటా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment