
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత(పాత ఫొటో)
సాక్షి, చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు... రిటైర్డ్ జడ్జి ఎ. అరుముగ స్వామి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే 75 మంది సాక్ష్యులతో పాటు మరో ఏడుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా దాఖలు చేసిన పిటిషన్లను పరిశీలించిన కమిషన్.. దర్యాప్తును వేగవంతం చేసింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో జయలలితను పర్యవేక్షించిన ముగ్గురు ఎయిమ్స్ డాక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జీసీ ఖిల్ననీ (పల్మనాలజీ విభాగం), అంజన్ త్రిఖా(ఎనిస్థీయాలజీ ప్రొఫెసర్ ), నితీష్ నాయక్(కార్డియాలజీ విభాగం ప్రొఫెసర్)లు ఆగస్టు 23, 24 తేదీల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి (సెప్టెంబరు 22, 2016) మరణించే రోజు(డిసెంబరు5, 2016) వరకు ఈ ముగ్గురు వైద్య నిపుణుల బృందం ‘అమ్మ’ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించింది.
కాగా అనారోగ్యానికి గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మరణించిన సంగతి తెలిసిందే. జయ అనారోగ్యం, చికిత్స తదితర విషయాలను గోప్యంగా ఉంచడం.. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్న సమయంలో తమను సైతం లోపలికి వెళ్లి అమ్మను చూడనివ్వలేదని అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఆరోపించడంతో జయ మరణం ఒక మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబరు, 2017లో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment