
జయ చికిత్స కోసం మళ్లీ ఎయిమ్స్ వైద్యులు!
ఇక చెన్నై రానన్న డాక్టర్ రిచర్డ్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యపరిస్థితిని సమీక్షించేందుకు ఎయిమ్స్ వైద్యులు మరోసారి చెన్నైకి వస్తున్నట్లు సమాచారం. జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరి బుధవారానికి 35 రోజులైంది. అపోలో వైద్యులు, ప్రఖ్యాత ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులు డాక్టర్ రిచర్డ్, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులంతా ఒక బృందంగా ఏర్పడి ఇప్పటివరకు చికిత్స చేస్తూ వస్తున్నారు. నెలరోజులుగా పడకపైనే ఉన్నందున కాళ్లు, చేతులు కొద్దిగా స్వాధీనం తప్పాయి. దీంతో సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులను పిలిపించా రు. అందరి సమష్టి కృషి ఫలితంగా సీఎం దాదాపుగా కోలుకున్నారు.
పక్కపై కూర్చోవడంతోపాటు ఆహారాన్ని తానే తినగలుగుతున్నారు. దీపావళి పండుగకు ముందుగానే ఆమెను డిశ్చార్జ్ చేయాలని భావిస్తున్నారు. ఈ దశలో ఆమె ఆరోగ్యాన్ని సమీక్షించేందుకు ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు గురు లేదా శుక్రవారాల్లో మరోసారి చెన్నైకి వస్తున్నారు. కాగా, సుమారు 20 రోజులుగా లండన్-చెన్నై మధ్య చక్కర్లు కొడుతూ సీఎంకు చికిత్స అందిస్తున్న డాక్టర్ రిచర్డ్ వచ్చే నెల 7 తర్వాత చెన్నైకి రావడం కుదరదని చెప్పినట్లు సమాచారం. ఇదిలాఉండగా ఉప ఎన్నికలు జరిగే తంజావూరు, తిరుప్పరగున్రం, అరవకురిచ్చి నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి జయలలిత ఆదేశాల మేరకు ఇన్‌చార్జులను నియమిస్తున్నట్లు అన్నాడీఎంకే కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తూ సేలంలోని మారియమ్మన్ ఆలయంలో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొని 55 ఏళ్ల గుర్తుతెలియని కార్యకర్త మృతి చెందాడు.