
'జయమ్మ చాలా బాగున్నారు.. త్వరలో ఇంటికి'
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆమె పార్టీ ఏఐఏడీఎంకే బుధవారం తాజా ప్రకటన చేసింది. ప్రస్తుతం జయలలిత చాలా బాగా కోలుకున్నారని, త్వరలోనే ఆమె ఇంటికి వస్తారని తెలిపింది. గత సెప్టెంబర్ 22న డిహైడ్రేషన్ సమస్యతో జయ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై పలు ఊహాగానాలు వదంతులు వ్యాపించాయి. వీటన్నింటికి తెరదించుతూ అపోలో ఆస్పత్రి వైద్యులతోపాటు, రాజభవన్ కూడా జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ఆమె ఆరోగ్యంలో వేగంగా పురోగతి వస్తోందని, త్వరలోనే ఆమె పూర్తి స్థాయిలో కోలుకుంటారని ప్రకటన చేశారు. కాగా, తాజాగా పార్టీ కూడా జయ ఆరోగ్యంపై బుధవారం మరోసారి ప్రకటన చేసింది.