రోడ్లపైనే యుద్ధవిమానాల ల్యాండింగ్
మీరు రోడ్డుపై వెళ్తుంటే.. అకస్మాత్తుగా ఓ యుద్ధవిమానం మీ ముందు ల్యాండ్ అవచ్చు. విమానాలు ల్యాండ్ కావడానికి ప్రత్యేక రన్ వే అవసరం కదా.. రోడ్డుపై ల్యాండ్ అవడం ఏంటీ అని అనుకోకండి. భారత వైమానిక దళం ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. విమానాల ల్యాండింగ్కు అనుమతి ఇవ్వాలని కోరుతూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు వైమానిక దళం లేఖ రాసింది.
అమెరికా, బ్రిటన్, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే రోడ్లపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేస్తున్నాయి. హైవేలను విశాలంగా నిర్మించడం వలన మనం కూడా విమానాలను ల్యాండ్ చేయడం వీలవుతుందని రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి శంకర్ ప్రసాద్ తెలిపారు. దీనిలో భాగంగా మిరేజ్ 2000 రకానికి చెందిన విమానాన్ని గత మే నెలలో నోయిడా - ఆగ్రా రహదారిపై విజయవంతంగా ల్యాండ్ చేశారు. అత్యవసర సమయంలో విమానాల ల్యాండింగ్కు ఎక్కడో దూరంగా ఉన్న రన్ వే ల కోసం చూడకుండా ఈ విధానం ద్వారా తక్షణమే స్పందించడానికి వీలవుతుందని ఎయిర్ ఫోర్స్ భావిస్తుంది.
పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలయిన గుజరాత్, రాజస్థాన్లలో ఇలా రోడ్లను రన్ వే లు గా ఉపయోగించుకోవడం వలన అత్యవసర సమయంలో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. విమానాలు ల్యాండ్ కావడానికి రహదారులు మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు పొడవుతో తగినంత విశాలంగా, సమాంతరంగా ఉంటేనే వీలవుతుంది.