విమానం టైరు పేలిపోయి...
ఎయిరిండియా విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరిన 170 మందికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలి ఉన్నాయి కాబోలు. అందుకే వాళ్లకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరిన ఎయిరిండియా విమానం సరిగ్గా ల్యాండ్ అవుతోందనగా.. దాని టైరు పేలిపోయింది. అందులో 161 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే వాళ్లంతా సురక్షితంగా కిందకు దిగగలిగారు.
ఉదయం 9.10 గంటలకు విమానం దిగే సమయానికి అక్కడంతా మంచు దట్టంగా అలముకుని ఉంది. వెనకవైపు ఉన్న టైరు పేలిపోయింది. అయినా పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దించగలిగారు. బెంగళూరు నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి విమానాన్ని పరిశీలించారు. ఈ కారణంగా ఉదయం 10.20 గంటలకు 138 మంది ప్రయాణికులతో షార్జా వెళ్లాల్సిన ఆ విమానం బాగా ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది.