అజిత్‌ పవార్‌కు భారీ ఊరట! | Ajit Pawar Gets Clean Chit In Irrigation Scam | Sakshi
Sakshi News home page

అజిత్‌ పవార్‌కు భారీ ఊరట!

Published Mon, Nov 25 2019 4:48 PM | Last Updated on Mon, Nov 25 2019 4:50 PM

Ajit Pawar Gets Clean Chit In Irrigation Scam - Sakshi

ముంబై : మహా రాజకీయాల్లో కీలక మలుపుకు కారణమైన అజిత్‌ పవార్‌కు భారీ ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్‌ స్కామ్‌కు సంబంధించి ఆయనపై నమోదైన 20 కేసుల్లో 9 కేసులకు సంబంధించిన విచారణను మహారాష్ట్ర ఏసీబీ అధికారులు ముగించారు. దీంతో అజిత్‌ పవార్‌కు కొంతమేర ఊరట కలిగినట్టయింది. అయితే దీనిపై ఏసీబీ డీజీ మాట్లాడుతూ.. దాదాపు 3వేల టెండర్లకు సంబంధించిన ఫిర్యాదులపై తాము విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని కేసుల విచారణను మాత్రమే ముగించినట్టు తెలిపారు. మిగతా వాటిలో విచారణ యథావిథిగా కొనసాగుతుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పుడు మూసివేసిన కేసులకు సంబంధించి కోర్టు ఆదేశించిన, వాటికి సంబంధించి మరింత సమాచారం లభించిన తిరిగి విచారణ జరుపుతామని ఏసీబీ వర్గాలు తెలిపాయి.

ఎన్సీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అజిత్‌ పవార్‌ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ. 70 వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అజిత్‌ పవార్‌ బీజేపీకి మద్దతుగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, అజిత్‌ పవార్‌ కేసులకు భయపడే బీజేపీకి మద్దతు తెలిపాడని పలువురు ఎన్‌సీపీ నేతలు ఇదివరకే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఇరిగేషన్‌ స్కామ్‌లో అజిత్‌ పవార్‌కు ఊరట లభించడపై ఎన్సీపీ నేతలు స్పందిస్తూ.. ఇది ఆయనకు బీజేపీ ఇచ్చిన గిఫ్ట్‌ అని వ్యాఖ్యానించారు.  అజిత్‌ పవార్‌ ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. విదర్భ ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ క్లియరెన్స్‌ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్‌ పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే 2014లో దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అజిత్‌ పవార్‌తో పాటు ఎన్సీపీ ముఖ్య నాయకులను విచారించేందుకు ఏసీబీకి అనుమతిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement