Irrigation Scam
-
అజిత్ పవార్‌కు క్లీన్ చిట్
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్‌పై ఇరిగేషన్ ప్రాజెక్టుల కుంభకోణానికి సంబంధించి ఉన్న 9 కేసులపై దర్యాప్తును సరైన ఆధారాలు లేని కారణంగా మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) సోమవారం వెల్లడించింది. ఈ కేసులతో ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌కుæ సంబంధంలేదని ఏసీబీ అదనపు ఎస్పీ అజయ్ అఫెల్ ప్రకటించారు. కాంగ్రెస్–ఎన్సీపీ ప్రభుత్వ హయాం(1999–2014)లో అజిత్ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో రూ.70వేల కోట్ల మేర జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణ చేస్తోంది. అవసరమని భావిస్తే కోర్టు గానీ, ప్రభుత్వం కానీ ఈ కేసులను తిరిగి తెరవచ్చునని అజయ్ తెలిపారు. విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతులిచ్చిన 45 ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ ముంబై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ విషయంలో దర్యాప్తు చేపట్టి ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేయగా, 5 కేసుల్లో చార్జిషీట్లు వేసినట్టు తెలిపారు. ఈనెల 23వ తేదీన బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ శాసనసభాపక్ష నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే అజిత్ పవార్‌పై కేసులు మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రకటించడం దుర్మార్గమని కాంగ్రెస్ మండిపడింది. -
అజిత్ పవార్‌కు భారీ ఊరట!
ముంబై : మహా రాజకీయాల్లో కీలక మలుపుకు కారణమైన అజిత్ పవార్‌కు భారీ ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ స్కామ్‌కు సంబంధించి ఆయనపై నమోదైన 20 కేసుల్లో 9 కేసులకు సంబంధించిన విచారణను మహారాష్ట్ర ఏసీబీ అధికారులు ముగించారు. దీంతో అజిత్ పవార్‌కు కొంతమేర ఊరట కలిగినట్టయింది. అయితే దీనిపై ఏసీబీ డీజీ మాట్లాడుతూ.. దాదాపు 3వేల టెండర్లకు సంబంధించిన ఫిర్యాదులపై తాము విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం కొన్ని కేసుల విచారణను మాత్రమే ముగించినట్టు తెలిపారు. మిగతా వాటిలో విచారణ యథావిథిగా కొనసాగుతుందని వెల్లడించారు. దీనిపై త్వరలోనే పూర్తి స్థాయిలో స్పష్టత ఇస్తామన్నారు. ఇప్పుడు మూసివేసిన కేసులకు సంబంధించి కోర్టు ఆదేశించిన, వాటికి సంబంధించి మరింత సమాచారం లభించిన తిరిగి విచారణ జరుపుతామని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అజిత్ పవార్ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూ. 70 వేల కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అజిత్ పవార్ బీజేపీకి మద్దతుగా నిలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, అజిత్ పవార్ కేసులకు భయపడే బీజేపీకి మద్దతు తెలిపాడని పలువురు ఎన్సీపీ నేతలు ఇదివరకే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరిగేషన్ స్కామ్‌లో అజిత్ పవార్‌కు ఊరట లభించడపై ఎన్సీపీ నేతలు స్పందిస్తూ.. ఇది ఆయనకు బీజేపీ ఇచ్చిన గిఫ్ట్ అని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు 1999 నుంచి 2014 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో మనీ ల్యాండరింగ్‌కి పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. విదర్భ ఇరిగేషన్ డెవలప్మెంట్ అథారిటీ గవర్నింగ్ కౌన్సిల్ క్లియరెన్స్ లేకుండా 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చినట్టు అజిత్ పవార్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే 2014లో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసుకు సంబంధించి అజిత్ పవార్‌తో పాటు ఎన్సీపీ ముఖ్య నాయకులను విచారించేందుకు ఏసీబీకి అనుమతిచ్చారు. -
నాడు అజిత్‌ను జైలుకు పంపుతానన్న ఫడ్నవీస్
ముంబై: రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే మాట మరోమారు రుజువైనట్టు కనిపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఇరిగేషన్ స్కాంపై అజిత్ పవార్ జైలుకెళ్లక తప్పదని శపథాలు చేసిన ఫడ్నవీస్ తాజాగా అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా, తాను సీఎంగా ప్రమాణ స్వీకారంచేశారు. దీంతో 2014లో ఫడ్నవీస్ అజిత్‌పవార్‌ను ఉద్దేశించి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఎన్సీపీని ‘నేచురల్లీ కరప్ట్ పార్టీ’గా అభివర్ణించిన మోదీ ప్రస్తుతం ఎన్సీపీ నేత అజిత్‌పవార్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. -
అధికారులే దోషులా?
ముంబై: మహారాష్ట్రలో చోటుచేసుకున్న కోట్లాది రూపాయల ఇరిగేషన్ (నీటిపారుదల ప్రాజెక్టుల) కుంభకోణంపై విచారణ జరిపిన మాధవ్ చితాలే కమిటీ శనివారం నాడు తన నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు సమర్పించింది. దాదాపు 14 నెలల పాటు వేలాది పత్రాలను పరిశీలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 1,361 పేజీల నివేదికను రూపొందించింది. ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవకతవకలకు నీటిపారుదల విభాగం అధికారులనే బాధ్యులను చేసినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన పలు ఆమోదాలకు, అవకతవకలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ సహా పలువురు రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినప్పటికీ చితాలే అధికారులనే బాధ్యులను చేసినట్లు తెలిసింది. ఈ నివేదికను సంక్షిప్తంగా ప్రజలకు అర్ధమయ్యే భాషలో 15 రోజుల్లో రూపొందించాలని ముఖ్యమంత్రి చవాన్ ఔరంగాబాద్‌లోని జలవనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఆదేశించారు. ముందుగా రాష్ట్ర మంత్రివర్గం ఈ నివేదికను పరిశీలించి ఆ తరువాత దానిని ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచనున్నారు. అయితే అది ఎప్పుడు అన్న విషయాన్ని వెల్లడించేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు నిరాకరించారు. జలవనరుల విభాగంలో చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించేందుకు నీటి నిర్వహణ నిపుడైన చితాలేను ప్రభుత్వం 2012 డిసెంబర్లో నియమించింది. జల వనరుల విభాగం ఎన్సీపీ నియంత్రణలో ఉన్న సంగతి తెల్సిందే. దాదాపు దశాబ్ద కాలం పాటు జలవనరుల శాఖకు మంత్రిగా పని చేసిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇరిగేషన్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 2012లో రాజీనామా చేశారు. నిబంధనలను అతిక్రమిస్తూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని కొన్ని రెట్లు పెంపు చేశారని అప్పట్లో మీడియాలో వార్తలు వెలువడ్డాయి. దీంతో అప్పుడు పదవి నుంచి వైదొలగిన అజిత్ పవార్ తిరిగి డిసెంబర్ నెలలోనే మంత్రివర్గంలో చేరారు. 1999-2009 మధ్య కాలంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఏకపక్షంగా కట్టబెట్టారని ఆరోపణలు వెలువడ్డాయి. 38 ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.20,050.66 కోట్ల నుంచి 26,722.33 కోట్లకు పెంచారు. వీటిలో 30 ప్రాజెక్టులకు ఆదరాబాదరాగా కేవలం నాలుగు రోజుల్లో మంజూరు చేశారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిసిన ఒకరోజు తరువాత చితాలే కమిటీ తన నివేదికను సమర్పించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ముంగిట జరిగిన ఈ పరిణామం రాజకీయంగా ఎన్సీపీకి నష్టం కలిగించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరిగేషన్ కుంభకోణంలో సుమారు 70వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ నిధులను నిష్ర్పయోజనమైన ప్రాజెక్టులపై ఖర్చు చేశారని లేదా గల్లంతు చేశారని విమర్శించాయి. చితాలే కమిటీ నివేదికను బహిర్గతం చేసి, దోషులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దోషులు రాజకీయ నాయకులైనా, అధికారులైనా శిక్షించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్ చేశారు. ఆదర్శ్ కమిషన్ నివేదికను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించినట్టుగానే ప్రభుత్వం చితాలే నివేదికను కూడా దాచిపెడుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టుల కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపై చితాలే కమిటీకి అనేక సాక్ష్యాధారాలు సమర్పించామని ఫడ్నవిస్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవచ్చని ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ చీఫ్ ఇంజనీర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ పంధారే అభిప్రాయపడ్డారు.