ముంబై: మహారాష్ట్రలో చోటుచేసుకున్న కోట్లాది రూపాయల ఇరిగేషన్ (నీటిపారుదల ప్రాజెక్టుల) కుంభకోణంపై విచారణ జరిపిన మాధవ్ చితాలే కమిటీ శనివారం నాడు తన నివేదికను ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు సమర్పించింది. దాదాపు 14 నెలల పాటు వేలాది పత్రాలను పరిశీలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 1,361 పేజీల నివేదికను రూపొందించింది. ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవకతవకలకు నీటిపారుదల విభాగం అధికారులనే బాధ్యులను చేసినట్లు తెలుస్తోంది.
ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన పలు ఆమోదాలకు, అవకతవకలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్ సహా పలువురు రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినప్పటికీ చితాలే అధికారులనే బాధ్యులను చేసినట్లు తెలిసింది. ఈ నివేదికను సంక్షిప్తంగా ప్రజలకు అర్ధమయ్యే భాషలో 15 రోజుల్లో రూపొందించాలని ముఖ్యమంత్రి చవాన్ ఔరంగాబాద్‌లోని జలవనరుల అభివృద్ధి కేంద్రాన్ని ఆదేశించారు.
ముందుగా రాష్ట్ర మంత్రివర్గం ఈ నివేదికను పరిశీలించి ఆ తరువాత దానిని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. అయితే అది ఎప్పుడు అన్న విషయాన్ని వెల్లడించేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు నిరాకరించారు.
జలవనరుల విభాగంలో చోటు చేసుకున్న అవకతవకలను పరిశీలించేందుకు నీటి నిర్వహణ నిపుడైన చితాలేను ప్రభుత్వం 2012 డిసెంబర్‌లో నియమించింది. జల వనరుల విభాగం ఎన్సీపీ నియంత్రణలో ఉన్న సంగతి తెల్సిందే. దాదాపు దశాబ్ద కాలం పాటు జలవనరుల శాఖకు మంత్రిగా పని చేసిన ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇరిగేషన్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో సెప్టెంబర్ 2012లో రాజీనామా చేశారు. నిబంధనలను అతిక్రమిస్తూ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయాన్ని కొన్ని రెట్లు పెంపు చేశారని అప్పట్లో మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
దీంతో అప్పుడు పదవి నుంచి వైదొలగిన అజిత్ పవార్ తిరిగి డిసెంబర్ నెలలోనే మంత్రివర్గంలో చేరారు. 1999-2009 మధ్య కాలంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ రూ.20వేల కోట్ల విలువైన ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఏకపక్షంగా కట్టబెట్టారని ఆరోపణలు వెలువడ్డాయి. 38 ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాన్ని రూ.20,050.66 కోట్ల నుంచి 26,722.33 కోట్లకు పెంచారు. వీటిలో 30 ప్రాజెక్టులకు ఆదరాబాదరాగా కేవలం నాలుగు రోజుల్లో మంజూరు చేశారు. ఇదిలా ఉండగా, అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిసిన ఒకరోజు తరువాత చితాలే కమిటీ తన నివేదికను సమర్పించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల ముంగిట జరిగిన ఈ పరిణామం రాజకీయంగా ఎన్సీపీకి నష్టం కలిగించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరిగేషన్ కుంభకోణంలో సుమారు 70వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆ నిధులను నిష్ర్పయోజనమైన ప్రాజెక్టులపై ఖర్చు చేశారని లేదా గల్లంతు చేశారని విమర్శించాయి. చితాలే కమిటీ నివేదికను బహిర్గతం చేసి, దోషులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దోషులు రాజకీయ నాయకులైనా, అధికారులైనా శిక్షించాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్ర ఫడ్నవిస్ డిమాండ్ చేశారు. ఆదర్శ్ కమిషన్ నివేదికను తొక్కిపెట్టేందుకు ప్రయత్నించినట్టుగానే ప్రభుత్వం చితాలే నివేదికను కూడా దాచిపెడుతుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ప్రాజెక్టుల కుంభకోణంలో రాజకీయ నాయకుల పాత్రపై చితాలే కమిటీకి అనేక సాక్ష్యాధారాలు సమర్పించామని ఫడ్నవిస్ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకపోవచ్చని ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన మాజీ చీఫ్ ఇంజనీర్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు విజయ్ పంధారే అభిప్రాయపడ్డారు.
అధికారులే దోషులా?
Published Sat, Mar 1 2014 10:42 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement