అందరూ ఏకగ్రీవమే!
బెంగళూరు: కర్ణాటక శాసనమండలి సభ్యుల ఎన్నిక, ఈ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కానున్నాయి. రాజ్యసభలో నాలుగు స్థానాలు, శాసన మండలిలో ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 19న ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే సోమవారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి ఖాళీలకు సరిపోను సభ్యులే నామినేషన్లు దాఖలు చేశారు. దాంతో రెండు ఎగువ సభలు రాజ్యసభ, శాసన మండలికి జరగాల్సిన ద్వైవార్షిక ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి.
రాజ్యసభకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీజేపీ, జేడీఎస్‌లకు చెందిన ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. శాసన మండలికి కాంగ్రెస్ నుంచి నలుగురు, బీజేపీ, జేడీఎస్‌ల నుంచి ఒక్కొక్కరు, మరో ఇండిపెండెంట్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అందువల్ల అందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. అయితే ఈ విషయం అధికారికంగా ప్రకటించవలసి ఉంది.