ఈ ఓటమి మోదీ.. అమిత్ షా.. అందరిదీ: శరద్ యాదవ్
బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి ఏ ఒక్కరిదో కాదని.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇలా మొత్తం అందరిదీ అవుతుందని జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. నిజానికి మొదట్లో తమకు కూడా కొంత అనుమానం ఉందని, ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం బిహార్లో దిగిపోయిందని తెలిపారు. ఈ ఎన్నికలను కమ్యూనలైజ్ చేసే ప్రయత్నాలు జరిగాయని, బీఫ్, రిజర్వేషన్లు.. ఇలా అన్ని అంశాలను తెరమీదకు తెచ్చారని అన్నారు. అవార్డు వాప్సీ.. లాంటి అంశాలన్నింటి ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద ఉందన్నారు.
కేవలం బిహార్లోనే కాదు, మొత్తం దేశంలో బలహీన వర్గాలు తిరగబడినా, దాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. కులవ్యవస్థలో వేల ఏళ్లుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి ఓటర్లుగా వాళ్లు ముందుకొచ్చారని శరద్ యాదవ్ చెప్పారు. దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ మీద చర్చ జరుగుతున్న సమయంలో ఆ విషయంలో వేలు పెట్టడంతో అది వాళ్లకు ఎదురు దెబ్బగా మారిందని విశ్లేషించారు. ఇక మహాకూటమి విజయం కూడా ఏ ఒక్కరిదో కాదని.. ఇది మొత్తం కూటమి గెలుపని తెలిపారు.