పొత్తు కాంగ్రెస్‌తోనే..
ఆర్‌ఎల్‌డీతో ఉండదు: ఎస్పీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడుతుం దన్న ఊహాగానాలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఫుల్‌స్టాప్ పెట్టింది. కాంగ్రెస్‌తోనే కలసి పోటీ చేస్తామని, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)తో తమకు ఎలాంటి పొత్తూ ఉండబోదని స్పష్టం చేసింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా మీడియాతో మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ తోనే పొత్తు కుదుర్చుకున్నాం. ఆర్‌ఎల్‌డీతో ఎలాంటి అవగాహనా లేదు. ఆ పార్టీతో మేం అసలు చర్చించనే లేదు. మేం రాష్ట్రంలోని మొత్తం 403 స్థానాలకు 300కి పైగా సీట్లలో పోటీ చేస్తాం.
మిగతా వాటిలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలుపు తుంది’అని తెలిపారు. పొత్తు, సీట్ల కేటా యింపునకు సంబంధించి ఎస్పీ అధినేత, యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పార్టీ సీనియర్ నాయకులతో గురువారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చిం చారు. అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నందా వెల్లడించారు. తాము ఇవ్వజూపిన సీట్ల కన్నా ఆర్‌ఎల్‌డీ అదనంగా కోరిందని.. దాంతో ఆ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్నట్లు ఎస్పీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎస్పీని పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ అధినేత అఖిలేశ్.. శివ్‌పాల్ యాదవ్ బహిష్కరించిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు.