'ఎంజాయ్ చేశారుగా.. పార్లమెంటును జరగనివ్వండి'
నోయిడా: కొత్త సంవత్సరంలోనైనా పార్లమెంటు వ్యవహారాలు జరగనివ్వాలని భారత ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలను కోరారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పారు. ఆరు దశాబ్దాలపాటు అధికారాన్ని ఎంజాయ్ చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా సభలను కొనసాగేందుకు సహకరించాలని కోరారు. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే రహదారికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శంకుస్థాపన చేశారు. 7,500 కోట్ల భారీ వ్యయంతో 14 లేన్లతో నిర్మించనున్న ఈ రహదారి శంకుస్థాపన సందర్బంగా మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఆరు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎంజాయ్ చేసిందని, దేశ అభివృద్ధి విషయంలో తనకు ఏం తెలియనట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు.
ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని చేతికందిస్తే కాంగ్రెస్ బాధ్యతారహితంగా వ్యవహరించి ఆరు దశాబ్దాలు వృధాగా గడిపిందని మండిపడ్డారు. 'రేపు జనవరి 1. కొత్త సంవత్సర వేడుకలకు వెళ్లే ముందు గట్టిగా ప్రమాణం చేయండి.. మేం పార్లమెంటును సజావుగా జరగనిస్తామని.. దేశ అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని' అని మోదీ అన్నారు. 'లోక్ సభ ప్రారంభమైనప్పటి నుంచి నాకు సరిగా మాట్లాడే అవకాశమే రావడం లేదు. అందుకే నేను జనసభల్లో మాట్లాడుతున్నాను.
ప్రజలు మనల్ని పార్లమెంటుకు పంపించింది చర్చించడానిని.. నిర్ణయాలు తీసుకోవడానికి.. ఎక్కడివక్కడ పెండింగ్ లో పెట్టడానికి కాదు.. సభా వ్యవహారాలు నిలిచిపోయేలా చేసేందుకు కాదు' అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కు ఓ విజ్ఞప్తి చేశారు. గ్రూప్-3, గ్రూప్-4 పరీక్షలకు ఇంటర్యూలు నిర్వహించవద్దని, మెరిట్ ఆధారంగా వారు ఉద్యోగాలు పొందేలా అవకాశం కల్పించాలని ఆ విజ్ఞప్తిలో కోరారు.