చండీగఢ్ : ‘చాలు.. ఇక చాలు.. శాంతి మంత్రం జపించాల్సిన అవసరం లేకుండా చేశారు. వాళ్లకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి భారత ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని భావిస్తున్నాను’ అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ భావోద్వేగానికి లోనయ్యారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పంజాబ్ అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
ఈ క్రమంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి అంటూ ప్రసంగాలు చేస్తుంటే.. ఇక ఆ దేశ ఆర్మీ జనరల్ కమర్ జావేద్ బజ్వా మాత్రం యుద్ధం గురించి మాట్లాడి అసలు నిజాన్ని బట్టబయలు చేస్తారు అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పంజాబీ(పాక్) అయిన జావేద్ బజ్వా... తానెంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించగలడో.. భారత పంజాబీలు కూడా అంతటి ధైర్యవంతులేనన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. పంజాబ్ జోలికి రావాలని చూస్తే బజ్వాను ఎలా దారికి తేవాలో ఇక్కడి పంజాబీలకు తెలుసునని హెచ్చరించారు.
మరోసారి దుస్సాహసానికి పాల్పడకుండా ఉండాలంటే..
‘పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ స్థాపించి గురుద్వార సాహిబ్ సేవ చేస్తానంటారు. కానీ ఆయన ఐఎస్‌ఐ మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది. ద్వంద్వ విధానాలకు ఇది నిదర్శనం. ఆ దేశ ఆర్మీ జనరల్ బజ్వా మద్దతుతో గద్దెనెక్కిన ఇమ్రాన్ ఖాన్ ఇంతకన్నా ఏం చేస్తారు. చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి హేయమైన ఘటనలు ఆపండి. మరొక విషయం.. కొన్ని దేశాల ప్రోద్బలంతో 2020లో రిఫరెండం చేపట్టాలని చూస్తున్న కలిస్థాన్ వేర్పాటువాదుల ఆటలు కూడా ఇకపై కొనసాగవు’ అని అమరీందర్ సింగ్ హెచ్చరికలు జారీ చేశారు. ‘వాళ్లు(ఉగ్రవాదులు) అతిగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోనట్లైతే వారు మరోసారి దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పాకిస్తాన్ ఎత్తుగడలను సరైన విధంగా అంచనా వేయాలి. వారికి బుద్ధి చెప్పాలి’ అని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.
కాగా సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ముష్కరులపై యావత్ భారతావని ఆవేశంతో రగిలిపోతోంది. జవాన్ల త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన జవాబు ఇచ్చి తీరాల్సిందేనంటూ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఆత్మాహుతి దళసభ్యుడు తన కారుతో.. జవాన్ల కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment