సాక్షి, న్యూఢిల్లీ : అమరనాథ్ యాత్ర కోసం కశ్మీర్‌లో అడుగుపెట్టిన ఉత్తర, దక్షిణాది భారతీయులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ఒడ్డున మూత్ర విసర్జన చేయడం పట్ల కశ్మీరీలు మండిపడుతున్నారు. మరోపక్క మహిళలు కూడా సామూహికంగా మూత్ర విసర్జనలు చేయడం ఏమిటని? ఇదెక్కడి సంస్కృతి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సరస్సు ఒడ్డున మగవాళ్లు మూత్ర విసర్జన చేస్తున్న ఫొటోను ప్రచురించిన ‘కాశ్మీర్ వాలా, ది సిటిజెన్’ లాంటి స్థానిక పత్రికలు ఈ తీరును తప్పుబట్టగా.. అలాంటి ఫొటోలతోని ట్విట్టర్, వాట్సాప్‌లలో కొందరు తమదైన శైలిలో స్పందించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను చూసి మీరు నేర్చుకున్నది ఇదేనా ? అంటూ కొందరు.. ‘టాయ్‌లెట్’ బాలీవుడ్ సినిమా చూడలేదా అంటూ మరికొందరు స్పందించారు. అమర్‌నాథ్ యాత్ర కోసం భారీ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ భారీ ఎత్తున మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దాల్ లేక్‌ను ఎందుకు పాడుచేస్తున్నారని వారు ప్రశ్నించారు. ‘మేం బతకడానికి ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నామని చెప్పుకునే మీరు ఈ కుసంస్కారాన్ని ఎలా సమర్థిస్తారు?’ ఇంకొకరు ట్వీట్లు చేస్తున్నారు.
విమర్శలు చేస్తున్నవారిలో కశ్మీర్ ముస్లింలతోపాటు హిందువులు, ముఖ్యంగా పండిట్లు కూడా ఉన్నారు. ‘ అమర్‌నాథ్ యాత్రికులను మా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు మా సహజ వనరులను కలుషితం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే మనస్తత్వాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఇది విచారకరమే కాదు, సిగ్గుచేటైన విషయం. అత్యున్నత ఆధ్యాత్మిక స్ఫూర్తితో వెళుతున్న యాత్రికులకు కూడా మీరు అగౌరవం తీసుకొచ్చారు. మీరు ఏ రాష్ట్రం వారైనా కావచ్చు. స్వచ్చ భారత్ అభియాన్‌కు మచ్చతెచ్చారు’ అని సామాజిక కార్యకర్త, కశ్మీర్ పండిట్ సంజయ్ పార్వ వ్యాఖ్యానించారు.
దాల్ సరస్సు పక్కన పారిశుద్ధ్య పరిస్థితులు అంత సవ్యంగా లేకపోవడం వల్లనే అక్కడ యాత్రికులు మూత్ర విసర్జన చేశారని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముందు తమరు ముందు నేర్చుకోండంటూ కశ్మీరీలకు కొందరు కౌంటర్ ట్వీట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment