
సెంటనెలీస్ తెగ చేతిలో దారుణ హత్యకు గురైన అమెరికన్ టూరిస్ట్ జాన్ అలెన్
న్యూఢిల్లీ : క్రైస్తవ మత ప్రచారం కోసం అండమాన్ నికోబార్‌లోని నార్త్ సెంటినల్ దీవికి వెల్లిన జాన్ అలెన్ అనే ఓ అమెరికా జాతీయుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. అయితే జాన్ అండమాన్, నికోబార్ దీవులకు వెళ్లడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరి హృదయాలను కలచి వేస్తోంది. ‘మీ అందరికీ నేను పిచ్చివాడిలా కనిపించొచ్చు. కానీ అండమాన్‌లోని సెంటినెలీస్ తెగకు చెందినవారికి జీసస్ గురించి బోధించడానికి ఇదే సరైన సమయం. దేవుడా.. నాకు చనిపోవాలని లేదు’ అంటూ జాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఈ పోస్ట్ పెట్టిన తర్వాతే జాన్ అండమాన్ దీవులకు వెళ్లారు. గతంలో జాన్ ఐదుసార్లు అండమాన్, నికోబార్ దీవులను సందర్శించారు. జాన్ క్రైస్తవ మతబోధకుడు కావడంతో ఆ ఆదివాసీ తెగవారికి కూడా బోధనలు చేయాలని అనుకున్నారు. కానీ ఆ తెగ వారు బయటివారితో సంబంధాలను ఏమాత్రం ఇష్టపడరు. అందుకే జాన్‌పై బాణాలు వేసి చంపేశారు. అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వారిని క్షమిస్తున్నాం: జాన్ కుటుంబం
జాన్ అలెన్ మృతి గురించి తెలిసిన అతని కుటుంబ సభ్యులు జాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మెసేజ్‌ని పోస్ట్ చేశారు. జాన్ అలెన్ ‘మరణించాడని మాకు తెలిసింది. అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటనెలీస్ తెగ ప్రజలు అతన్ని చంపారని చెపుతున్నారు. జాన్ మృతి మా కుటుంబానికి తీరని లోటు. ఈ విషాదం గురించి మేం మాటల్లో చెప్పలేం. తను మా ప్రియమైన కుమారుడు, సోదరుడు, స్నేహితుడు. తనో క్రైస్తవ మత ప్రచారకుడు, సాకర్ కోచ్, పర్వాతారోహకుడు కూడా. అతను దేవున్ని ప్రేమిస్తాడు.. అవసరమున్న వారికి సాయం చేయడంలో ముందుంటాడు. అతను సెంటినెలీస్ ప్రజలను కూడా అలానే ప్రేమించాడు. జాన్ మరణానికి కారణమైన వారిని మేము క్షమిస్తున్నామని తెలిపారు.
అంతేకాక ‘జాన్‌ను ఆ ప్రాంతానికి తీసుకెళ్లడానికి సాయం చేసిన అతని మిత్రులను అరెస్ట్ చేసినట్లు మాకు తెలిసింది. వారిని కూడా వదిలిపెట్టాల్సిందిగా నా మనవి. తన ఇష్టప్రకారమే అక్కడికి వెళ్లాడు. అతని చర్యలకు వేరేవాళ్లని శిక్షించడం సరికాదు. కుటుంబ సభ్యులుగా మీరు మా మనవిని మన్నిస్తారని ఆశిస్తున్నామం’టూ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment