బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, అలాగే జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ సోమవారం తీవ్ర గందరగోళం నడుమ ఆమోదించింది. 370వ అధికరణాన్ని రద్దు చేయడం కోసం రాష్ట్రపతి సంతకంతో నోటిఫికేషన్ విడుదలైన అనంతరం హోం మంత్రి అమిత్ షా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అలాగే జమ్మూ కశ్మీర్‌ను ఇకపై అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ, ఆ రాష్ట్రంలోని లదాఖ్ ప్రాంతాన్ని కూడా విడదీసి, పూర్తిగా మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ‘జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ను, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను జమ్మూకశ్మీర్‌లో కూడా అమలు చేసే మరో బిల్లును కూడా అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. తీర్మానం, రిజర్వేషన్ల బిల్లును మూజువాణి ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మాత్రం ఓటింగ్ నిర్వహించగా, అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. దీంతో బిల్లు ఆమోదం పొందింది.
ఈ వ్యవహారమంతా సాగుతున్న సమయంలో సభలో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. జమ్మూ కశ్మీర్‌పై అమిత్ షా ప్రకటన చేసిన వెంటనే కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తదితర పార్టీల సభ్యులు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. అక్కడే కూర్చొని తీవ్ర నిరసన తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఎంపీ ఒకరు తన బట్టలు చించుకుని నిరసన తెలిపారు. మరో పీడీపీ ఎంపీతో కలిసి ఆయన రాజ్యాంగం ప్రతులను చించడంతో వారిద్దరినీ మార్షల్స్ బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. ఎన్డీయేలో భాగమైన జేడీ(యూ) మినహా, మిగిలిన అన్ని ఎన్డీయే పార్టీలూ బిల్లుకు మద్దతు తెలిపాయి. తటస్థ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, అన్నా డీఎంకే, బీజేడీ, బీఎస్పీ, ఆప్ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలపగా, కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు తదితర పార్టీలు వ్యతిరేకించాయి.
ఎన్డీయేలోనే భాగమైన జేడీ(యూ) మాత్రం సభ నుంచి వాకౌట్ చేసింది. ముందుగా చెప్పకుండా, బిల్లు ప్రతులను సభ్యులకు అందజేయకుండానే బిల్లును ఎలా ప్రవేశపెడతారని విపక్ష సభ్యులు ప్రశ్నించగా, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సమాధానమిస్తూ, ఈ అంశం అత్యవసర, దేశ ప్రయోజనాలకు సంబంధించినదనీ, తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ముందస్తు నోటీసు లేకుండానే, బిల్లును సభ్యులకు అందజేయకుండానే సభలో ప్రవేశపెట్టేందుకు తాను ప్రభుత్వానికి అనుమతినిచ్చానని వెంకయ్య తెలిపారు. బిల్లు ప్రతులను సభ్యులకు అందజేసిన రోజే బిల్లును ఆమోదింపజేసుకోవడాన్ని విపక్ష సభ్యులు ప్రశ్నించగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పారు. బిల్లు ప్రతులను సభ్యులకు అందజేసిన రోజే వాటిని ప్రభుత్వాలు ఆమోదింపజేసుకున్న ఘటనలు గతంలో 38 సార్లు జరిగాయని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
లేచి స్వాగతం పలికిన బీజేపీ ఎంపీలు..
సభలోకి అమిత్ షా అడుగు పెడుతుండగా, బీజేపీ ఎంపీలంతా లేచి ఆయనకు స్వాగతం పలికారు. తమ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని అమిత్ షా తెలిపారు. తీర్మానాన్ని, బిల్లును సభలో అమిత్ షా ప్రవేశపెట్టగానే విపక్ష సభ్యులు తొలుత నినాదాలు చేశారు. అనంతరం వెల్‌లోకి వెళ్లి అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. వారిలో ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ ఉప నేత ఆనంద్ శర్మ, తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రయిన్ తదితరులున్నారు. 370వ అధికరణం కారణంగా ఇన్నాళ్లూ జమ్మూకశ్మీర్ రాష్ట్రం పూర్తిగా భారత్‌లో విలీనం కాలేకపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. ‘370వ అధికరణం ఇక ఎంతమాత్రమూ జమ్మూ కశ్మీర్‌కు వర్తించదు. పార్లమెంటు సిఫారసుల ఆధారంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. 2019 ఆగస్టు 5 నుంచి ఆర్టికల్ 370లోని అన్ని నిబంధనలూ రద్దయ్యాయి. ఇక నుంచీ భారత రాజ్యాంగంలోని అన్ని నిబంధనలూ జమ్మూ కశ్మీర్‌లో కూడా అమలవుతాయి’అని తెలిపారు. ఆర్టికల్ 370ని రద్దు చేసే అధికారిక నోటిఫికేషన్ పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే సంతకం చేశారని అమిత్ షా సభకు చెప్పారు.
జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం శాసనసభ రద్దయినందున, ఆ అసెంబ్లీ అధికారాలన్నీ పార్లమెంటు ఉభయ సభల వద్ద ఉన్నాయని షా చెప్పారు. ‘రాష్ట్రపతి ఉత్తర్వులను చర్చించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు తీర్మానాన్ని ఆమోదించగలవు’అని అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రతులను సభలోని సభ్యులందరికీ అందజేశారు. 370వ అధికరణాన్ని రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రద్దు చేయడం లేదా సవరించవచ్చని ఆయన నిబంధనలను చదివి వినిపించారు. ఎస్పీ ఎంపీ రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ లేకుండానే రాజ్యాంగాన్ని సవరించవచ్చా అని ప్రశ్నించగా, అమిత్ షా సమాధానమిస్తూ, ‘1952, 1962ల్లో కాంగ్రెస్ వెళ్లిన దారిలోనే ఇప్పుడు మేం వెళ్తున్నాం. అప్పుడు కాంగ్రెస్ రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారానే 370వ అధికరణాన్ని వారు సవరించారు’అని చెప్పారు. విపక్షాల వాదనలో బలం లేదనీ, రాజకీయాల కోసమే వాళ్లు దీనిని వ్యతిరేకిస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంటుంది: వైగో
తమిళనాడుకు చెందిన వైగో మాట్లాడుతూ ఆత్యయిక స్థితి రోజులు మళ్లీ వచ్చాయనీ, ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందని ఆరోపించారు. భవిష్యత్తులో కశ్మీర్ కూడా కొసోవో, దక్షిణ సూడాన్ , తూర్పు తైమూర్‌లా మారుతుందని హెచ్చరించారు. ప్రపంచంలో భారత్‌కు కూడా శత్రువులు ఉన్నారనీ, ఈ అంశంపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకుంటుందని వైగో అన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన డెరెక్ ఒబ్రెయిన్ మాట్లాడుతూ ‘ఈ సోమవారం ఓ దుర్దినం. దేశ రాజ్యాంగానికి, భారత అభిప్రాయానికి, రాజ్యసభకు ఇది చీకటి రోజు’అని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో పాలస్తీనాలాగా కశ్మీర్ మారుతుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా విమర్శించారు. డీఎంకేకి చెందిన తిరుచ్చి శివ మాట్లాడుతూ ఇలాంటి విషయాల మీద నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర అసెంబ్లీకే ఉంటుందనీ, కేంద్రం చేస్తున్నది చెల్లదని అన్నారు. సీపీఎం సభ్యుడు టీకే రంగరాజన్ మాట్లాడుతూ ఈ అంశంపై ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ ప్రజలను సంప్రదించలేదనీ, ఆరెస్సెస్–బీజేపీలు కలిసి దేశ రాజ్యాంగాన్ని, ఐక్యతను చెడగొడుతున్నాయని అన్నారు.
బట్టలు చించుకున్న అహ్మద్ మిర్
అమిత్ షా ప్రకటన అనంతరం పీడీపీకి చెందిన ఎంపీ ఫయాజ్ అహ్మద్ మిర్ తన బట్టలు చించుకుని నిరసన తెలిపారు. రాజ్యాంగ ప్రతులను చించేశారు. దీంతో ఆయనతోపాటు మరో పీడీపీ ఎంపీని బయటకు పంపాల్సిందిగా వెంకయ్యనాయుడు మార్షల్స్‌ను ఆదేశించారు. ‘భారత రాజ్యాంగం అత్యున్నతం. రాజ్యాంగాన్ని ఎవరూ చించజాలరు. సభలోనే రాజ్యాంగాన్ని చించడం, ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కుదరదు. నేను మీపై చర్య తీసుకుంటాను’అని వెంకయ్య అన్నారు. మార్షల్స్ వీరిని చేరుకోబోతుండగానే, బీజేపీ ఎంపీ విజయ్ గోయెల్ వారితో గొడవకు దిగబోయారు. అయితే వెనుక నుంచి ఆయనను లాగడంతో ఆ ఇద్దరు ఎంపీలను ముట్టు కోలేకపోయారు.
కొసావోగా మారనివ్వం: అమిత్ షా
బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏ కారణంగానే జమ్మూ కశ్మీర్‌లో పేదరికం, ఉగ్రవాదం, అవినీతి ఉన్నాయనీ, అభివృద్ధి జరగలేదని అన్నారు. కశ్మీర్‌పై ఆందోళన వద్దనీ, ఏ పాలస్తీనా లాగానో, కొసావో లాగానో కశ్మీర్‌ను తాము మారనివ్వమని ఆయన చెప్పారు. ‘కశ్మీర్ అంటే భూతల స్వర్గం. అది అలాగే ఉంటుంది. ఇందులో ఏ భయమూ అక్కర్లేదు’అని పేర్కొన్నారు. సరైన సమయం వచ్చినప్పుడు, సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు జమ్మూకశ్మీర్‌కు మళ్లీ తిరిగి పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కూడా ఇస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి ఆర్టికల్ 370నే అతిపెద్ద అడ్డంకి. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా మార్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్టికల్ 370, 35–ఏ ఉన్నంత కాలం అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని చెరిపివేయడం సాధ్యపడదు.
భారత చట్టాలు అక్కడ అమలు కాకుండా ఈ రెండు అధికరణాలు అడ్డుపడుతున్నాయి. అభివృద్ధిని అడ్డుకుని, అవినీతిని విశృంఖలం చేస్తున్నాయి. గత 70 ఏళ్లలో కశ్మీర్‌లో కేవలం మూడు కుటుంబాలే పాలన సాగించి, ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చి, అవినీతికి ఊతమిచ్చాయి. జమ్మూ కశ్మీర్‌ను ఆర్టికల్ 370యే నాశనం చేసింది. ఆ రాష్ట్రంలో పేదరికానికి ఆ అధికరణమే కారణం. స్థిరాస్తి వ్యాపారంలో భూముల ధరలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే కశ్మీర్‌లో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ సిమెంటు బస్తా మాత్రం మిగతా ప్రాంతాల కన్నా అక్కడే రూ. 100 ఎక్కువగా ఉంది. బయటి వాళ్లు స్థలాలు కొనకూడదన్న నిబంధన కారణంగా ఆ రాష్ట్రంలో పర్యాటకం కూడా అభివృద్ధి చెందలేదు. ఆర్టికల్ 370 కారణంగా అక్కడ ఏ పరిశ్రమనూ పెట్టలేము. ఏ ప్రైవేటు ఆసుపత్రీ ఆ రాష్ట్రానికి వెళ్లదు. విద్యలోనూ ఇంతే. విద్యా హక్కు చట్టమే అక్కడ అమలు కావడం లేదు. విద్య ఫలాన్ని కశ్మీరీ బాలలు ఎందుకు పొందకూడదు? జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం కారణంగా దాదాపు 42 వేల మంది పౌరులు ఇప్పటివరకు చనిపోయారు. ఈ చావులకు ఎవరి విధానం కారణం? ఇప్పుడు.. ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కశ్మీర్ నిజంగా భారత్‌లో అంతర్భాగం అవుతుంది’అని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు.
రాష్ట్రం తల నరికారు: ఆజాద్
రాజ్యసభలో జరిగిన ఘటనలపై సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ, ‘భారత దేశానికి కిరీటంగా భావించే రాష్ట్రం తలను నరికేశారు. కశ్మీరీ అస్తిత్వాన్ని చెరిపేశారు. ఇలా జరుగుతుందని నా రాజకీయ జీవితంలో నేను ఏనాడూ ఊహించింది కూడా లేదు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు సభలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఆజాద్ మాట్లాడుతూ కశ్మీర్ లోయ మొత్తం కర్ఫ్యూ విధించారనీ, ముగ్గురు మాజీ సీఎంలను గృహ నిర్బంధంలో ఉంచారన్నారు. కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిపై తొలుత చర్చించాలని ఆజాద్ పట్టుబట్టారు. అయినా తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అమిత్ షాకు వెంకయ్య అనుమతినిచ్చారు. దీంతో ‘రిజర్వేషన్ బిల్లుకు మేం వ్యతిరేకం కాదు. కానీ కశ్మీర్‌లో పరిస్థితిపై ముందుగా చర్చించాలి’అని ఆజాద్ డిమాండ్ చేశారు. ‘భారత్‌లో జమ్మూకశ్మీర్ విలీనం అవ్వడంలో 370వ అధికరణం పాత్ర కీలకం. గత 70 ఏళ్లలో అక్కడ లక్షలాది మంది భద్రతా సిబ్బంది, పౌరులు మరణించారు.
ఇద్దరు ఎంపీలు రాజ్యాంగాన్ని చించేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కానీ వారు మా పార్టీ మనుషులు కాదు. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాం. కానీ ఇప్పుడు బీజేపీ ప్రజాస్వామ్యాన్ని చంపేసింది’అని మండిపడ్డారు. ‘జమ్మూకశ్మీర్‌ను తేలిగ్గా తీసుకున్నారు. ఇది సిగ్గు మాలిన చర్య. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలోకి జమ్మూకశ్మీర్‌ను తీసుకొచ్చి విలువలేకుండా చేశారు. ఈ బిల్లు పాసైన రోజు భారత చరిత్రలో దుర్దినం. భారత చిత్రపటం నుంచి జమ్మూకశ్మీర్‌ను తొలగిస్తున్నారు. ఈ రోజు హోం మంత్రి వచ్చినప్పుడు అణు బాంబు పేలితే ఉండే వాతావరణాన్ని సభలో చూపించారు. నవభారతాన్ని నిర్మించేందుకు మీరు పాత భారతాన్ని ముక్కలుగా విడగొట్టి నాశనం చేస్తారా? ఓట్లకోసం దేశ చరిత్ర, సంస్కృతి, ఐక్యతతో ప్రభుత్వం ఆటలాడకూడదు. రాష్ట్ర అభీష్టానికి విరుద్ధంగా ఆర్టికల్ 370, 35(ఏ)లను రద్దు చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ప్రజలు భద్రతా దళాలకు మద్దతుగా ఉన్నారు. పాకిస్తాన్ మతం, వాళ్ల మతం ఒక్కటే అయినా వారు పాక్‌ను ఎంచుకోలేదు. కానీ మీరిప్పుడు కశ్మీర్ దేశం నుంచి విడిపోయేందుకు పునాదులు వేస్తున్నారు.
విలీనం చట్టాల ద్వారా జరగదు. ప్రజల మనసుల ద్వారా జరుగుతుంది. గుజరాత్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు మీరు బిల్లును తీసుకురాగలరా? విషయాలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటుంది. అధికారమనే మత్తులో కేంద్రం జమ్మూకశ్మీర్ చరిత్రను తుడిచిపెడుతోంది’అని అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై అమిత్ షా ఎదురుదాడి చేస్తూ, 1947 అక్టోబర్ 27న జమ్మూ కశ్మీర్ భారత్‌లో విలీనం అవ్వగా, 1949లో ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారనీ, అలాంటప్పుడు జమ్మూ కశ్మీర్ విలీనంలో 370వ అధికరణం కీలకం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్ 370 వల్లనే జమ్మూ కశ్మీర్ భారత్‌లో విలీనమైందన్న వాదన తప్పని ఆయన చెప్పారు. ఈ అధికరణాన్ని తాత్కాలిక పద్ధతినే రాజ్యాంగంలో ప్రవేశపెట్టారని.. రాజకీయంగా కృతనిశ్చయం లేక, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం గత ప్రభుత్వాలు దీనిని తొలగించలేదని షా ఆరోపించారు.
ఉదయం నుంచి ఏం జరిగిందంటే!
జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటు ముందుకు తీసుకొచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేసింది. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను మరోసారి ధ్రువీకరించుకునేందుకు, కశ్మీర్‌లో తాజా పరిస్థితిపైనా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా పలుమార్లు చర్చించుకున్నారు. అమిత్ షా, మోదీతోపాటు భద్రత వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాలు, న్యాయ శాఖమంత్రితో సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి ఢిల్లీలోని పరిస్థితులను ఓసారి గమనిస్తే..
- సోమవారం తెల్లవారుజామునే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో అమిత్‌షా భేటీ అయ్యారు. న్యాయ, రాజ్యాంగపరమైన అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది.
- 7 గం‘‘కు: ప్రధాని నివాసానికి చేరుకున్న హోంమంత్రి అమిత్‌షా దాదాపు గంటసేపు బి ల్లుకు సంబంధించిన అంశంపై చర్చలు జరిపా రు. రాజ్యసభలో బిల్లు సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించినట్లు సమాచారం.
- 9.30 గం‘‘కు: ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, హోంమంత్రి షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా పలువురు ముఖ్యమైన అధికారులు పాల్గొన్నారు.
- 9.55 గం‘‘కు: రాజ్యసభలో నేడు సభలో కీలకమైన చట్టాలను అత్యవసరంగా చర్చించాల్సిన అవసరం ఏర్పడిందంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సంకేతాలిచ్చారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.
- 10.10 గం‘‘కు: అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.
- 10.30 గం‘‘కు: ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చిన అమిత్ షా. ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ. అక్కడినుంచి షా నేరుగా పార్లమెంటుకు చేరుకున్నారు. 11గంటలకు రాజ్యసభలో, 12 గంటలకు లోక్‌సభలో అమిత్ షా మాట్లాడతారనే సమాచారం వచ్చింది.
- 11.00 గం‘‘కు: పార్లమెంటుకు చేరుకున్న మోదీ, రాజ్‌నాథ్ సింగ్. అంతకుముందే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడారని, 370 రద్దుకు సంబంధించిన సమాచారాన్ని అందించడంతోపాటు అప్రమ త్తంగా ఉండాలని సూచించారని సమాచారం.
- 11.15 గం‘‘కు: రాజ్యసభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన షా. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దుచేసేందుకు నిర్ణయం తీసుకున్నామని సభ ముందు ప్రతిపాదన. సభలో విపక్ష సభ్యుల గందరగోళం. విపక్షాలు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలిస్తామని.. దీనిపై సుదీర్ఘచర్చ జరిపేందుకు సిద్ధమని ప్రకటించిన అమిత్ షా.
- 6.55 గం‘‘కు: సాయంత్రం వరకు రాజ్యసభలో వివిధ పార్టీల నేతలు 370 రద్దుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. బిల్లుకు పలుపార్టీలు మద్దతివ్వగా కాంగ్రెస్, జేడీయూ సహా పలు పార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు ప్రక టించాయి. తీవ్రమైన చర్చోపచర్చల తర్వాత సాయంత్రం 6.55 గంటలకు రాజ్యసభ జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019కు ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభలో షా ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment