రావణాసురుడూ మరణించాడు!
ఇతని పేరు దల్బీర్‌సింగ్. అమృత్‌సర్ దసరా ఉత్సవాల్లో రావణుడి వేషం కట్టి అందరినీ అలరించాడు. రావణ దహనాన్ని కళ్లారా చూడాలని అనుకున్నాడు. ఆ సందడి, ఆ కోలాహలం బాగా కనిపించాలన్న ఉద్దేశంతో రైల్వే ట్రాక్ ఉన్న వైపు వెళ్లాడు. అప్పటికే అక్కడ వందలాది మంది చేరుకొని చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి ఉత్సవం చూడటంలో మునిగిపోయారు. అదే సమయంలో సూపర్ స్పీడ్‌తో రైలు మృత్యు శకటంలా తరుముకొస్తూ ఉండటాన్ని దల్బీర్ గమనించాడు.రైల్వే ట్రాక్ మీదున్న వాళ్లకి ప్రమాదం గురించి హెచ్చరించాలని పరుగులు తీశాడు. కానీ రెప్పపాటులోనే ఘోరం జరిగిపోయింది. రైలు దల్బీర్‌ను ఢీకొట్టి అతని శరీరాన్ని ఛిద్రం చేసింది. ఒకవైపు రావణుడి దిష్టిబొమ్మ మంటల్లో దగ్ధమవుతుంటే అదే సమయంలో రావణ పాత్రధారి ఇనుప చక్రాల కింద పడి నలిగిపోవడం అందరినీ కలిచివేసింది. రామ్‌లీలాలో గత పదేళ్లుగా దల్బీర్ సింగ్ వివిధ రకాల పాత్రల్ని పోషిస్తూనే ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు పాత్రధారులకి కూడా మేకప్ తదితర అంశాల్లో సహకరించాడు. కార్యక్రమం పూర్తయి ముగింపు దశకు వచ్చే సమయంలో తోటి వారిని ఆదుకోవడానికి వెళ్లి తానే బలైపోయాడు. దల్బీర్ సింగ్‌కు భార్య, ఎనిమిదినెలల కొడుకు ఉన్నాడు.
అమృత్‌సర్: ఘోర రైలు ప్రమాదంతో పంజాబ్ అమృత్‌సర్‌లోని జోడా ఫాటక్ ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోవైపు అటు రైల్వే, ఇటు అమృత్‌సర్ నగరపాలక సంస్థ అధికారులు ఈ దుర్ఘటనకు తాము కారణం కాదని వాదిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 61 అని శుక్రవారం చెప్పిన అధికారులు తాజాగా లెక్కను సవరించి ఈ ఘటనలో 59 మంది చనిపోయారనీ, మరో 57 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల బంధువులను పరామర్శించిన అనంతరం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని సీఎం ప్రతిపక్షాలను కోరారు. తప్పెవరిదో నాలుగు వారాల్లో విచారణలో తేలుతుందని చెప్పారు. క్షతగాత్రులను శుక్రవారం రాత్రే ఆసుపత్రులకు తరలించిన సిబ్బంది శనివారం ఉదయానికల్లా ఘటనా స్థలం నుంచి మృతదేహాలను తొలగించారు.
చనిపోయిన 59 మందిలో 40 మందిని గుర్తించామనీ, 36 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయని అధికారులు శనివారం చెప్పారు. మరో నలుగురి మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌లోని వారి సొంత ప్రాంతాలకు పంపించామన్నారు. చనిపోయిన వారిలో అత్యధికులు ఉత్తరప్రదేశ్, బిహార్‌లకు చెందిన వలస కూలీలేననీ, వీరంతా జోడా ఫాటక్ చుట్టుపక్కలే నివసించేవారని అధికారులు చెప్పారు. ఆసుపత్రుల వద్ద మృతుల బంధువులు, క్షతగాత్రుల రోదనలతో అమృత్‌సర్‌లో పరిస్థితి హృదయవిదారకంగా ఉంది.
సమాచారం లేదు.. అనుమతి తీసుకోలేదు
ఈ ప్రమాదానికి బాధ్యత తమది కాదనీ, ఇందులో తమ తప్పేమీ లేదని అమృత్‌సర్ నగరపాలక సంస్థ, రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదానికి రైల్వే ఎంత మాత్రం కారణం కాదనీ, డ్రైవర్‌పై విచారణ ఏదీ ఉండదని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. పట్టాలపై మనుషులను చూసిన వెంటనే గంటకు 91 కి.మీ.ల వేగంలో ఉన్న రైలును డ్రైవర్ 68 కి.మీ.లకు తగ్గించగలిగాడని చెప్పారు.
రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహాని మాట్లాడుతూ ‘జోడా ఫాటక్ దగ్గర కార్యక్రమం గురించి రైల్వేకు సమాచారం ఇవ్వలేదు. ప్రమాదం జరిగిన చోట లెవెల్ క్రాసింగ్ లేదు. ప్రజలే అక్రమంగా పట్టాలపైకి వచ్చారు’ అని చెప్పారు. అయినా డ్రైవర్ అత్యవసరంగా రైలును ఆపేందుకు ప్రయత్నించి ఉంటే మరింత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని ఆయన అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ సోనాలి మాట్లాడుతూ ‘జోడా ఫాటక్ దగ్గర దసరా వేడుకలకు ఎవ్వరూ అనుమతి ఇవ్వలేదు. అసలు మమ్మల్ని ఎవ్వరూ అనుమతి కోరనే లేదు’ అని చెప్పారు.
అమృత్‌సర్‌లో రైలు ప్రమాద మృతుల సామూహిక అంత్యక్రియల దృశ్యం
భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే..
ప్రభుత్వం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. శనివారం ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతో అక్కడి ప్రజలు ఘర్షణకు దిగారు. పట్టాల పక్కన అలాంటి వేడుక జరిగేందుకు ఎందుకు అనుమతించారు?’ అని ఓ స్థానికుడు ప్రశ్నించారు. శనివారం ఉదయం స్థానికులు రైలు పట్టాలపై కూర్చొని నిరసన తెలపడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 37 రైళ్లను రద్దు చేయగా మరో 16 రైళ్లను దారి మళ్లించారు. మరోవైపు ఈ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా రావణ దహన వేడుకలను నిర్వహిస్తున్నందున పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
500 రైళ్లొచ్చినా కదలరు
రైల్వే పట్టాల సమీపంలో రావణ దహనం కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ కుమారుడు ఆధ్వర్యంలో జరిగింది. వేడుకలకు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చిన వాళ్లు ట్రాక్ మీద నిలబడిన విషయాన్ని కూడా మర్చిపోయారు.
దాదాపు 5 వేల మంది ప్రజలు రైల్వే ట్రాక్‌పై నిలబడ్డారు. 500 రైళ్లు వచ్చినప్పటికీ.. వాళ్లు మాత్రం అక్కడ నుంచి కదలరు’అని కౌర్‌కు చెప్పాడు. ఘటన జరిగినప్పటి నుంచి కౌన్సిలర్ కొడుకు అదృశ్యమయ్యాడు. రైలు ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు నిర్వాహకుడు చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment