
లక్నో : బతుకు పోరాటంలో తమకు సాంత్వన చేకూర్చాలని రోడ్డెక్కిన అంగన్ వాడీ కార్యకర్తలను సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ అంగన్ వాడీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి రాజధాని లక్నోలో రోడ్లపైకి వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు.
పోలీసులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అంగన్ వాడీ కార్యకర్తలను శాంతింపచేసే యత్నం చేయగా ఫలితం లేకపోయింది. దీంతో బలవంతంగా వారిని చెల్లాచెదురు చేసేందుకు చూడటంతో తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. 'మేమేం అడిగామని మా డిమాండ్లు నెరవేర్చడం లేదు. మా కనీస వేతనం రూ.18 వేలు చేయడం. ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తింపు అడుగుతున్నాం. ఇక ఎన్నాళ్లయినా ఇంతేనా.. మా జీవితాల్లో మార్పు కోరుకోకూడదా అంటూ' అంగన్ వాడీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అవకాశం కూడా లేకపోయిందంటూ కార్యకర్తలు వాపోయారు.