'అన్నా' హజారే పోస్టర్ విడుదల!
సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'అన్నా' ఫస్ట్ లుక్ విడుదలైంది. శశాంక్ ఉదపుర్కర్ దర్శకత్వంలో వెలువడుతున్న చిత్రం పోస్టర్ ను ముంబైలోని ఓ కార్యక్రమంలో అన్నా హజారే స్వయంగా విడుదల చేశారు. 25 ఏళ్ళ వయసులో దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్న తనకు ప్రస్తుతం 79 సంవత్సరాలని, ఇప్పటికీ అదే మార్గంలో తాను నడుస్తున్నానని హజారే పోస్టర్ రిలీజ్ సందర్భంలో తెలిపారు. దేశంలో ఉన్నవారంతా తన కుటుంబ సభ్యులేనన్నారు.
ద రైజ్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వెలువడనున్న 'అన్నా' చిత్రానికి మహేంద్ర జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గోవింద్ నమ్ దేవ్, శతాత్ సక్సేనా, కిషోర్ కదమ్ చిత్రంలో నటిస్తుండగా... దర్శకుడు శశాంక్ ఉదపుర్కర్ అన్నా పాత్రను పోషిస్తున్నారు. కాజోల్ సోదరి తనీషా ముఖర్జీ ఈ సినిమాలో జర్నలిస్టు రోల్ లో కనిపించనుంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా హజారే.. 2011 లో జన్ లోక్ పాల్ బిల్లు తీసుకురావాలంటూ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే.