పొరుగు రాష్ట్రంలోనూ పోటీకి సై!
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న అన్నాడీఎంకే పొరుగు రాష్ట్రం కేరళపై కూడా కన్నేసింది. తమిళనాడుతోపాటు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్టు పార్టీ అధినేత్రి జయలలిత మంగళవారం ప్రకటించారు. తమిళనాడులోనూ కేరళలోనూ ఒకేసారి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అఖిల భారత అన్నాడీఎంకే పేరిట జాతీయ పార్టీగా నిలువాలని జయలలిత భావిస్తున్నారు.
ఇందులో భాగంగా అప్పుడప్పుడు పొరుగు రాష్ట్రాల్లోనూ ఆమె అభ్యర్థులను నిలబెడుతున్నారు. గతంలో నెల్లూరు జిల్లాలో కొన్ని స్థానాలకు అన్నాడీఎంకే అభ్యర్థులను నిలబెట్టింది. నేడు అదే బాటలో కేరళలో పోటీకి దింపుతోంది. పార్టీ తరఫున పోటీ చేసే ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవచ్చని జయలలిత ఓ ప్రకటనలో సూచించారు. దేశంలో ఎక్కడి నుంచి పోటీ చేసినా పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ ఆశీస్సులు అభ్యర్థులకు ఉంటాయని ఆమె పేర్కొన్నారు.